అమరావతి భూ కుంభకోణంలో సీబీఐ దర్యాప్తు చేయించాలన్న పట్టుదలతో ఉన్న ఏపీ ప్రభుత్వానికి వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వైపు నుంచి రివర్స్ షాక్ తగిలినట్లుగా అయింది. ఉభయగోదావరి జిల్లాల్లో ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ నేతలు వందల కోట్ల అవినీతికి పాల్పడినట్లుగా ఆయన కేంద్రానికి ఫిర్యాదు చేశారు. నేరుగా ప్రధానమంత్రికే లేఖ రాశారు. గత వర్షాల సమయంలో రాజమండ్రి అవ భూముల్లో ఎనిమిది అడుగుల మేర నీరు నిలిచిపోయాయి. ఆ ఒక్క చోటే కాకుండా.. ఉభయగోదావరి జిల్లాల్లో అనేక చోట్ల.. అతి చవకైన భూముల్ని .. భారీ ధరకు ప్రభుత్వంతో కొనిపించి వందల కోట్లు పోగేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీటన్నింటినీ ప్రధాని దృష్టికి రఘురామకృష్ణరాజు తీసుకెళ్లారు.
భూముల స్కాంతో పాటు ఇసుక అక్రమ రవాణా, ప్రభుత్వ పథకాల్లో అవినీతి ఎలా చేస్తున్నారో వివరిస్తూ.. ప్రధానికి రఘురామకృష్ణరాజు తన లేఖ రాశారు. ప్రధానమంత్రి కార్యాలయం ఆ లేఖను తగు చర్యలు తీసుకోవాలని సూచిస్తూ.. కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు పంపింది. హోంమంత్రిత్వ శాఖ.. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచారం పంపింది. ఆ లేఖ గత నెల ఇరవై నాలుగో తేదీనే ఏపీ సర్కార్‌కు అందింది. కానీ ప్రభుత్వం వైపు నుంచి స్పందన రాలేదు. దాంతో రఘురామకృష్ణరాజు ఆ లేఖ ప్రతిని జత చేస్తూ.. ఏసీబీ డీజీ సీతారామాంజనేయులు ఓ లేఖ రాశారు. అయితే.. రాజకీయ నేతలపై వచ్చిన ఆరోపణలు.. రాజకీయ నేతలు చేసే ఆరోపణల్ని ఏసీబీ తీసుకోదు కాబట్టి నర్సాపురం ఎంపీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
దర్యాప్తు చేయాలని ఏపీ సీఎస్‌కు ఇచ్చిన ఆదేశాల లేఖతో పాటు .. అంత పెద్ద అవినీతి జరగడం.. అధికారుల సహకారం లేకుండా సాధ్యం కాదని.. అందుకే ప్రభుత్వ అధికారులపైనా విచారణ చేయాలని రఘురామకృష్ణరాజు కోరారు. అంటే.. ఏసీబీ పరిధిలోకి ఉద్యోగులు వస్తారు కాబట్టి.. వారి మీద ఫిర్యాదు చేసినట్లుగా లేఖ పంపారు. కేంద్రం దృష్టికి అయితే ఈ అవినీతిని తీసుకెళ్లగలిగారు కానీ.. దర్యాప్తు చేయించాల్సింది.. చేయాల్సింది కూడా రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వ అధికారులే కాబట్టి.. చేయరు.. చేసినా.. రిపోర్ట్ ఎలా వస్తుందో అంచనా వేయడం పెద్ద విషయం కాదు. కానీ.. రఘురామకృష్ణరాజు మాత్రం తన పోరాటం తాను చేస్తున్నారు.