ఆంధ్రప్రదేశ్ రాజధానిగా మాత్రమే కాదు.. విశాఖను గోవాను మించి కాసినో హబ్‌గా మార్చాలని ఏపీ సర్కార్ నిర్ణయించుకుంది. ఈ విషయంపై ఇప్పటికే విశాఖ తీరంలో కొన్ని ప్రదేశాలను గుర్తించి.. కేంద్రానికి కూడా నివేదిక సమర్పించినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా ఎలాంటి స్పందన వ్యక్తం చేయకపోయినప్పటికీ.. ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో చాలా సీరియస్‌గా ప్రయత్నిస్తోందన్న ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆదాయ లోటులో ఉంది. ఆ లోటు కరోనా వల్ల వచ్చింది మాత్రమే కాదు..
పెట్టుబడి లేకుండా ఆదాయాన్నిచ్చే మార్గాల వైపు ఏపీ సర్కార్ చూపు..!
ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. పారిశ్రామికీకరణ తక్కువ. ఆదాయం కూడా తక్కువ. కానీ ఖర్చులు మాత్రం ఎక్కువ. కొత్త ప్రభుత్వం సంక్షేమం పేరుతో పథకాలు అమలు చేయడానికి ఏడాదిన్నరకు లక్షన్నర కోట్లు అప్పు చేయాల్సి వస్తోంది. దీనికి సంబంధించిన వాయిదాలు కట్టడం భారంగా మారితే.. ఐపీ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. గత ప్రభుత్వ హయాంలో పారిశ్రామికంగా కొంత ముందడుగు వేసినా.. ఆ తర్వాత పూర్తిగా పరిస్థితి మారిపోయింది.ఇప్పుడు ఏపీకి వచ్చే పరిశ్రమ లేదు.. అన్నీ పోయేవే. పైగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టే వ్యాపార సంస్థల్లేవు. ఇప్పటికిప్పుడు ఆదాయం పెరగాలంటే.. అయితే పన్నులైనా పెంచాలి.. లేదా అంతకు మించి మార్గాలైనా ఎంచుకోవాలి. ఎలాగూ పన్నులు పెంచుతున్న ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడు అదనపు ఆదాయ మార్గాలవైపు చూస్తోంది. ఎక్కువ శ్రమ లేకుండా… భారీగా ఆదాయం ఇచ్చే రంగాల వైపు చూస్తోంది.
మొన్నటిదాకా లాటరీ టిక్కెట్లపై చూపు.. ఇప్పుడు కేసినోల ప్రణాళికలు..!
ఇందులో భాగంగా కొద్ది రోజుల కిందట.. లాటరీ టిక్కెట్ల వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకున్నారు. అధికారులు కసరత్తు కూడా చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న లాటరీ టిక్కెట్ల వ్యాపారాన్ని పరిశీలించి వచ్చారు. ఓ నివేదిక సిద్ధం చేశారు. అయితే పెట్టాలా.. వద్దా అన్నదానిపై ఇంకా స్పష్టతకు రాలేదు. ఇప్పుడు కేసినోలు పెట్టాలన్న ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతానికి దేశంలో ఒక్క గోవాలో మాత్రమే కేసినోలకు పర్మిషన్ ఉంది. దేశంలో కేసినోలకు అలవాటుపడిన వాళ్లు ఎక్కువగా శ్రీలంకకు వెళ్తూంటారు. శ్రీలంకకు ఎక్కువ ఆదాయం వీటి ద్వారానే వస్తోంది. ఈ ఆదాయాన్ని స్టడీ చేసిన ఏపీ సర్కార్.. విశాఖ తీరంలో కేసినోలు ఏర్పాటు చేయడానికి అనువుగా ఉంటుందనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ తరపున కేంద్రానికి ప్రతిపాదనలు కూడా పంపారు. అటు వైపు నుంచి సానుకూలమైన స్పందన వస్తే.. శరవేగంగా .. విశాఖను కేసినో హబ్‌గా తీర్చిదిద్దేంగుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది.
విశాఖను కేసినో హబ్‌గా మార్చడానికి కేంద్రం ఒప్పుకుంటుందా..?
అయితే ప్రస్తుతం ఈ కేసినో అడుగులు.. ప్రతిపాదనల దగ్గరే ఉన్నాయి. కేంద్రం ఎంత వరకు అవకాశం ఇస్తుంది.. ఏపీ సర్కార్ ఎంత మేర ఒత్తిడి చేసి అనుమతులు తెచ్చుకోగలుగుతుంది అనేది కీలకం. ఎందుకంటే.. విశాఖ రక్షణ పరంగా అత్యంత కీలకమైనది. అక్కడ నేవల్ కమాండ్ బేస్ ఉంది. అక్కడ ఇలాంటి కేసినోలకు పర్మిషన్ ఇవ్వడం చిక్కులతో కూడుకున్న వ్యవహారం అని భావిస్తే.. ఏపీ సర్కార్ మరో ఆదాయార్జన మార్గం కూడా మూసుకుపోతుంది. అయితే.. ఏపీ సర్కార్ విభిన్న ఆలోచనను కేంద్రం మొదటి నుంచి సపోర్ట్ చేస్తోంది. మూడు రాజధానుల దగ్గర్నుంచి ప్రతీ విషయంలోనూ… మద్దతు తెలుపుతోంది. ఈ ప్రకారం చూసుకుంటే.. విశాఖను కేసినో హబ్‌గా మార్చుకునే దిశగా అనుమతి ఇచ్చినా ఆశ్చర్య పోనవసరం లేదన్న చర్చ కూడా అధికారవర్గాల్లో నడుస్తోంది. మొత్తానికి గోవాకు వెళ్లకుండా.. విశాఖలో ఆ తరహా అనుభూతి పొందే విధంగా ఏపీని అభివృద్ధి చేయాలనే సంకల్పాన్ని మాత్రం వైసీపీ సర్కార్ పెట్టుకుంది. ఎంత మేర సక్సెస్ అవుతుందో మరి..!