గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మళ్లీ వైరాగ్యం వచ్చేసింది. టీడీపీ తరపున గెలిచి..ఓ చిన్న కేసు పడగానే వైసీపీలోకి వెళ్లిపోయిన ఆయనకు అక్కడా సెగ తట్టుకోలేని విధంగా తగులుతోంది. వైసీపీలోకి వెళ్లే ముందు తాను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్లుగా కొంత హడావుడి చేశారు. ఆ తర్వాత వైసీపీలో చేరి.. చంద్రబాబును అన్ని రకాలుగా తిట్టారు. లోకేష్‌ను కూడా వదిలి పెట్టలేదు. అయితే అంతగా తిట్టినా ఆయనకు వైసీపీలో రెడ్ కార్పెట్ ఏమీ పరవడం లేదు. ఆయనకు వ్యతిరేకంగా వైసీపీ హైకమాండ్ ఇద్దరు నేతల్ని ఎగదోస్తోంది. అందులో ఒకరు గత ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అంగీకరించకుండా చేతులెత్తేసిన దుట్టా రామచంద్రరావు కాగా మరొకరు గత ఎన్నికల్లో పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు. హైకమాండ్ ఆశీస్సులు లేకపోతే.. వారు వంశీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టే అవకాశమే లేదు.
ఈ విషయాన్ని రూఢీ చేసుకున్న వల్లభనేని వంశీ ఇప్పుడు రియలైజ్ అయ్యారు. మళ్లీ తాను రాజకీయ సన్యాసం చేస్తానంటూ కొత్త పాట అందుకున్నారు. ఈ విధంగా అయినా వైసీపీ హైకమాండ్‌ను బ్లాక్మెయిల్ చేసి..మిగతా ఇద్దరు నేతల్ని కంట్రోల్ చేస్తారని వల్లభనేని వంశీ ఆశ పడుతున్నారు. అనుచరులతో హుటాహుటిన సమావేశమయ్యారు. కొందరు గొడవలు సృష్టించి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని .. వైసీపీ అధిష్ఠానం చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని వంశీ అనుచరులకు చెబుతున్నారు.
అయితే వంశీ ఇప్పటికే రాజకీయంగా ఘోరమైన తప్పు చేశారని..ఆయన గెలిచిన పార్టీని.. రాజకీయ భవిష్యత్ ఇచ్చిన పార్టీ అధినేతను బండబూతులు తిట్టి… వెళ్లారని అలాంటి వ్యక్తిని వైసీపీలో అయినా ఎవరు నమ్ముతారని..ఇప్పటికిప్పుడు ఆయనను బుజ్జగించడానికి వైసీపీ హైకమాండ్ ఏమీ ప్రయత్నం చేయదని.. ఒక వేళ చేసినా.. అది కంటి తుడుపుగానే ఉంటుందని అంటున్నారు. మొత్తానికి వంశీ అటూ ఇటూ కాని రాజకీయ గడ్డు పరిస్థితుల్లో ఇరుక్కుపోయారు. ఆయన బ్లాక్‌మెయిలింగ్‌కు వైసీపీ హైకమాండ్ ఎంత మేర మెత్తబడుతుందన్నదానిపైన రాజకీయ పయనం ఎంత కాలం అనేదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.