గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు బ్యాలెట్ పద్దతిలోనే జరగనున్నాయి. ఈ నిర్ణయం తీసుకోవడానికి కరోనా కారణం కాదు. ఈవీఎంలు…వీవీప్యాట్ లు అందుబాటులో లేకపోవడమే కారణమని ఎస్ఈసీ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి కరోనా కారణంగా ఈవీఎంలు వద్దని బ్యాలెట్‌నే వాడాలని బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు కోరాయి. అయితే కరోనా ఉన్నప్పటికీ.. బీహార్‌తో పాటు ఇతర ఉపఎన్నికల్ని ప్రత్యేక జాగ్రత్తలతో ఈసీ నిర్వహిస్తున్నందున ..అలాగే గ్రేటర్ ఎన్నికలు కూడా నిర్వహించాలని బీజేపీ నేతలు పట్టుబట్టారు. ఇదే అభిప్రాయాన్ని ఎస్ఈసీకి లిఖిత పూర్వకంగా తెలిపారు. అయితే తెలంగాణ అధికారపార్టీ …టీఆర్ఎస్కు మాత్రం ఈవీఎంలపై పెద్దగా నమ్మకం లేదు.
పార్లమెంట్ ఎన్నికల్లో తగిలిన షాక్‌తో… గత మున్సిపల్ ఎన్నికలను పూర్తిగా బ్యాలెట్ పద్దితలోనే ప్రభుత్వం నిర్వహించింది. నాలుగు లోక్‌సభ సీట్లను గెల్చుకున్న బీజేపీకి ఆ ఎన్నికల్లో దానికి తగ్గట్లుగా ఫలితాలు రాలేదు. అయితే పార్లమమెంట్ ఎన్నికలకు..మున్సిపల్ ఎన్నికలకు తేడా ఉంటుందని చెప్పుకున్నారు. ఇప్పుడు.. గ్రేటర్ ఎన్నికల్లోనూ బ్యాలెట్టే వాడుస్తున్నారు. వాస్తవానికి గత బల్దియా ఎన్నికల్లోనూ… ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్కు గ్రేటర్ పరిధిలో తిరుగులేని విజయాలొచ్చాయి.
అప్పుడు కాంగ్రెస్ సహా మరికొన్ని పార్టీల నేతలు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు టీఆర్ఎస్సే ఈవీఎంలు వద్దనుకుంటోంది. బ్యాలెట్ ప్రకారం జరిగే ఎన్నికల్లో … కొన్ని చెల్లని ఓట్లు… వస్తాయి… ఓట్ల లెక్కింపు ఆలస్యం అవుతుంది..కానీ ఫలితంపై మాత్రం ఎవరికీ అనుమానాలుండవు. దీంతో చాలా మందికి బ్యాలెట్టే బెటరన్న అభిప్రాయం ఉంది. గ్రేటర్ పరిధిలో ఉన్న దాదాపు 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బ్యాలెట్‌తోనే ఓటింగ్ జరగనుంది.