నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల టీజేఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడాలని కోదండరాం నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. ప్రశ్నించే గొంతుక కోసమే కోదండరాం పోటీచేస్తున్నారని టీజేఎస్ ప్రకటించింది. విద్యావంతుల్లో, తెలంగాణ కోసం ఉద్యమించిన వారిలో ప్రభు్తంపై తీవ్ర వ్యతిరేకత ఉందని..అది కోదండరాంకు లాభిస్తుందని టీజేఎస్ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో టీజేఏసీ చైర్మన్‌గా కోదండరాం…అన్నీ తానై నడిపారు. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆయనకు ప్రాధాన్యం తగ్గిపోయింది.
కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న ఆయన ప్రత్యేక తెలంగాణ లక్ష్యాలు నెరవేరడం లేదని తెలంగాణ జన సమితి పేరుతో కొత్త రాజకీయ పార్టీ పెట్టారు. కానీ వివిధ కారణాల రీత్యా ఆ పార్టీ ప్రజల్లో బలమైన ముద్రవేయలేకపోయింది. గత ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా ఆ పార్టీ తరపున అభ్యర్థులు నిలబడినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆ తర్వాత మహాకూటమి ఉనికి లేకుండా పోయింది. ఈ తరుణంలో కోదండరాం.. ఎమ్మెల్సీగా నిలబడాలని నిర్ణయించుకున్నారు. అయితే మహాకూటమిలోని పార్టీలు మద్దతు ఇస్తాయా లేదా అన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది.
ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వైఖరి అవలంభిస్తుందన్నది కోదండరాం గెలుపుపై కీలక ప్రభావం చూపించనుంది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే తెలంగాణ కొత్త కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిగం ఠాకూర్ మాత్రం…మిత్రుల్ని వదులుకోబోమని చెబుతున్నారు. కోదండరాంపై విద్యావంతుల్లో సానుభూతి ఉందని.. ఆయన ఉద్యమ సేవలకు గుర్తుగా.. ఆయనను ఎమ్మెల్సీగా గెలిపిస్తారన్న ప్రచారం ఉంది. ఈ విషయంలో కాంగ్రెస్ తీసుకునే నిర్ణయం కీలకం కానుంది.