ఓ సినిమా హిట్టయితే… వెంటనే ఆ దర్శకుడు, హీరో కలిసి మరో సినిమా మొదలెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంటారు. వాళ్లపై వాళ్లకు నమ్మకం పెరగడంతో పాటు, ఆ కాంబో అప్పటికే హిట్ అవ్వడంతో జనాలు మరింత ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే… ఆ కాంబోకి క్రేజ్. సినిమా విడుదలవ్వకముందే, అదే కాంబినేషన్ మళ్లీ సినిమా మొదలెట్టేస్తే ..? రాజ్ తరుణ్ అదే చేశాడు. `ఒరేయ్ బుజ్జిగా` సినిమా విడుదల కాకముందే… విజయ్ కుమార్ కొండాతో మరో సినిమా మొదలెట్టేశాడు.
ఒరేయ్ బుజ్జిగాపై ముందు నుంచీ రాజ్ తరుణ్ మంచి నమ్మకంతో ఉన్నాడు. ఈ సినిమాకి ఓటీటీ ఆఫర్లు వచ్చినా – అడ్డుకున్నది తరుణే. `సినిమాని థియేటర్లలోనే విడుదల చేద్దాం` అని పట్టుబట్టాడు. అయితే.. నిర్మాతకి మాత్రం ఓటీటీలో విడుదల చేయడం తప్పలేదు. తీరా చూస్తే… రాజ్ తరుణ్ ది కాన్ఫిడెన్స్ కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ అని తేలింది. ఈ సినిమా ఓటీటీలోనూ పల్టీ కొట్టేసింది. ఇదే సినిమా థియేటర్లో విడుదలైతే.. నిర్మాత భారీ నష్టాలు చవి చూసేవాడు. `ఒరేయ్ బుజ్జిగా` హిట్టవ్వడం గ్యారెంటీ అని, ఈ సినిమా హిట్టయితే.. విజయ్ కుమార్ కొండా ఇక దొరకడని భావించిన తరుణ్.. ఆ అవకాశం ఇవ్వకుండా సినిమా విడుదలవ్వక ముందే, మరో సినిమాని మొదలెట్టాడు. ఓ రకంగా చెప్పాలంటే.. రాజ్ తరుణ్ తొందరపడ్డాడు. రాజ్ తరుణే కాదు. నిర్మాత పరిస్థితీ అంతే. `ఒరేయ్ బుజ్జిగా`కి ఓటీటీ ఆఫర్లు రావడం చూసి, ఈ సినిమా హిట్టవుతుంది భావించిన ఓ ఎన్ ఆర్ ఐ ప్రొడ్యూసరు, ఆఘమేఘాల మీద సినిమాని మొదలెట్టారు. తీరా చూస్తే… `ఒరేయ్ బుజ్జిగా` ఫ్లాపయ్యింది. ఇప్పుడు రాజ్ తరుణ్ తదుపరి సినిమాకి ఈ మాత్రం ఓటీటీ రేటు రావడం కూడా కష్టంగానే అనిపిస్తోంది. ఈ కొత్త సినిమాకి క్లాప్ కొట్టకపోయి ఉంటే – ఈ పాటికి నిర్మాత ఈ ప్రాజెక్టుని పక్కన పెట్టేసేవాడే. ఇప్పుడు ముందుకు తీసుకెళ్లక తప్పని పరిస్థితి ఎదురైంది.