క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ పసందైన వినోదం పంచి పెడుతోంది. ఏప్రిల్ లో జరగాల్సిన ఐపీఎల్ కరోనా వల్ల సెప్టెంబరుకి ఫిష్ట్ అయ్యింది. ఆట ఆలస్యం అయినా, అందులోని మజా ఏమాత్రం తగ్గలేదు. మ్యాచ్‌లన్నీ పోటా పోటీగా సాగుతున్నాయి. టీఆర్ పీ పరంగా కొత్త రికార్డుల్ని సృష్టిస్తోంది ఈ ఐపీఎల్. అయితే.. ఆటగాళ్లకు మాత్రం దిన దిన గండం లా ఉంది. కరోనా భయాలు, డీ హైడ్రేషన్ బాధలూ… ఆటగాళ్లని వేధిస్తున్నాయి. ఇప్పుడు గాయాల బెడద కూడా తోడైంది.
ఐపీఎల్ లో కీలకమైన ఆటగాళ్లు భువనేశ్వర కుమార్ (హైదరాబాద్), అమిత్ మిశ్రా (ఢిల్లీ) గాయాల కారణంగా ఈ టోర్నీ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భునేశ్వర్ లేకపోవడం హైదరాబాద్ కి అది పెద్ద లోటు. భువి ఐపీఎల్ కే కాదు, ఆ తరవాత జరగబోయే ఆస్ట్రేలియా పర్యటనకూ దూరమయ్యే ఛాన్సు ఉందట. ఇప్పటికే మిచెల్ మార్ష్ గాయం వల్ల మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. గాయం వల్లే అంబటి రాయుడు (చెన్నై) రెండు మ్యాచ్‌లు ఆడలేదు. ఆ రెండు మ్యాచ్‌లలోనూ చెన్నై ఓడిపోయింది. రాయుడు ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. బ్రావో ( చెన్నై), ఇషాంత్ శర్మ (దిల్లీ) టోర్నీ ప్రారంభానికి ముందే గాయాల బారీన పడ్డారు. బ్రావో కాస్త కోలుకుని చెన్నైకి అందుబాటులోకి వచ్చాడు. అయితే తాను ఇంకా లయ అందుకోవాల్సివుంది. ఇషాంత్ శర్మ మాత్రం ఇంకా ఆటకు సిద్ధం కాలేదు. టోర్నీలో మూడొంతుల మ్యాచ్‌లు కూడా పూర్తికాలేదు. ఇప్పుడే ఇంతమంది కీలకమైన ఆటగాళ్లు గాయాలబారీన పడితే.. మున్ముందు పరిస్థితి ఏమిటో?? లాక్ డౌన్ కారణంగా ఆటగాళ్లు ఇళ్లకే పరిమితమయ్యారు. దాంతో ఫిట్ నెస్ తప్పింది. తగినంత ప్రాక్టీసు లేకుండా మైదానంలో దిగినందుకే ఇలా గాయాలు పలకరిస్తున్నాయన్నది విశ్లేషకుల మాట.