బిగ్ బాస్ షోకి నాగార్జుననే ప్రధాన ఆకర్షణ. అసలే స్టార్ సెలబ్రెటీలు లేక బోసిబోతున్న షోకి – నాగ్ తన వ్యాఖ్యానంతో, స్క్రీన్ ప్రెజెన్స్ తోకాస్త ఊపిరి పోస్తున్నాడు. ఇప్పుడు ఆ నాగ్ కూడా బిగ్ బాస్‌కి దూరమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం `వైల్డ్ డాగ్`. లాక్ డౌన్ తరవాత ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో మొదలెట్టారు. కొన్ని సన్నివేశాల్నీ తెరకెక్కించారు. ఇప్పుడు బ్యాంకాక్ లో ఓ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. నాగ్ బిగ్ బాస్ లో కనిపించేది వీకెండే. కాబట్టి హైదరాబాద్ లో షూటింగ్ అయితే… బిగ్ బాస్ సెట్లో అడుగుపెట్టడానికి పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు అలా కాదు. లొకేషన్ బ్యాంకాక్ కి షిఫ్ట్ అవుతుంది. అక్కడ కనీసం రెండు వారాల పాటు షూటింగ్ ఉండబోతోందట. అంటే.. రెండు శనివారాలు, రెండు ఆదివారాలూ.. నాగ్ కనిపించకుండా పోయే ఛాన్సుంది. నాగ్ లేకపోతే.. వీకెండ్ ఎపిసోడ్స్ ఏమాత్రం రక్తి కట్టవు. నాగ్ స్థానంలో మరో సెలబ్రెటీని తీసుకురావాల్సిందే. ఇప్పటికప్పుడు రెండు వారాల కోసం తాత్కాలిక సెలబ్రెటీ దొరకడం కష్టమే. పైగా.. ఆ సెలబ్రెటీ బిగ్ బాస్ షో ఫాలో అవ్వాలి. ఇవన్నీ జరిగే పనులు కావు. కాబట్టి `వైల్డ్ డాగ్` షూటింగ్ నే వాయిదా వేయమని బిగ్ బాస్ నిర్వాహకులు నాగ్ ని కోరుతున్నారు. అంతగా వీలు కాని పక్షంలో సుమ లాంటి యాంకర్ ని తీసుకొచ్చి.. షోని నడిపించేద్దామన్న ఆలోచనలో ఉంది బిగ్ బాస్ టీమ్.