దుబ్బాక ఉపఎన్నికల్లో బలమైన అభ్యర్థి కోసం కాంగ్రెస్ పార్టీ ఇంకా వెదుకుతూనే ఉంది. సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి పేరును హైకమాండ్‌కు పంపేశారని ఇక ఆయనే అభ్యర్థి అన్న ప్రచారాన్ని టీ పీసీసీ వర్గాలు వ్యూహాత్మకంగా చేశాయి. కానీ నిజానికి ఎవరి పేరునూ పంపలేదు. టీఆర్ఎస్ నుంచి వస్తాడని ఆశలు పెట్టుకున్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి కోసం ఈ ప్రచారాన్ని చేశారు. చెరుకు శ్రీనివాస్ రెడ్డి.. మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు. ఆయనకు నియోజకవర్గ వ్యాప్తంగా అనుచరగణం ఉంది. సోలిపేట రామలింగారెడ్డి మరణం కారణంగా టిక్కెట్ తనకే ఇస్తారని ఆయన ఆశలు పెట్టుకున్నారు. కానీ కేసీఆర్ రామలింగారెడ్డి భార్యకు టిక్కెట్ ఖరారు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేసి తీరాలన్న పట్టదలతో ఉన్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఇతర పార్టీల వైపు చూస్తున్నారు.
చెరుకు శ్రీనివాస్ రెడ్డి కోసం అటు కాంగ్రెస్.. ఇటు బీజేపీ కూడా ప్రయత్నాలు చేశాయి. అయితే గతంలో కాంగ్రెస్‌లో పని చేసిన అనుభవం ఉండటంతో.. ఆ పరిచయాలతో.. టీ పీసీసీ స్థాయిలో ఆయనను పార్టీలోకి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ టిక్కెట్ ఇవ్వడంలేదని తెలియడంతో.. శ్రీనివాస్ రెడ్డి కూడా.. కాంగ్రెస్ ఆఫర్‌కు టెంప్ట్ అవుతున్నారు. ఆయన అనుచరులతో సమావేశం నిర్వహించారు. పదహారో తేదీ వరకూ నామినేషన్ల గడువు ఉంది. తొమ్మిదో తేదీ నుంచి నామినేషన్లు దాఖలు చేయవచ్చు.
బీజేపీ తరపున అభ్యర్థిగా రఘునందన్ రావు ఉండటం ఖాయంగానే కనిపిస్తోంది. కాంగ్రెస్ తరపున శ్రీనివాస్ రెడ్డి పోటీ చేయడం ఖాయమని చెప్పుకోవచ్చు. అయితే టీఆర్ఎస్ తరపున దుబ్బాక బాధ్యతను.. మంత్రి హరీష్ రావు తీసుకున్నారు. ఆయన మ్యాజిక్ చేస్తే మాత్రం.. శ్రీనివాస్ రెడ్డి చివరి క్షణంలో పోటీ నుంచి విరమించుకున్నా ఆశ్చర్యం లేదు. అలా జరిగితే.. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారుతుంది.