రాజధాని విషయంలో గతంలో ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులు కొనసాగుతాయని ఏపీ హైకోర్టు తెలిపింది. రాజధాని పిటిషన్లపై రోజువారీ విచారణ ప్రారంభమయింది. ఈ సందర్భంగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది. అసెంబ్లీలో బిల్లులు ఆమోదించి… గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత హైకోర్టులో పలు రకాల పిటిషన్లు పడ్డాయి. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు స్టేటస్ కో విధించింది. ఈ స్టేటస్ కో ఎత్తివేసేలా ఆదేశాలివ్వాలని ఏపీ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లినా ప్రయోజనం కలగలేదు. సాధారణంగా ఇలాంటి కేసుల్లో విచారణ పూర్తయ్యే వరకూ స్టేటస్ కో కొనసాగుతుంది. అందుకే సుప్రీంకోర్టుకు ప్రభుత్వం వెళ్లింది. అయినా ప్రయోజనం కలగలేదు. ఇప్పుడు విచారణ పూర్తయ్యే వరకూ స్టేటస్ కో కొనసాగే అవకాశం ఉంది.
స్టేటస్‌కోను సీఎం క్యాంప్ ఆఫీస్, స్టేట్ కమిషనరేట్‌ల విషయంలో వర్తింప చేయవద్దని ప్రభుత్వం తరపు న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు. గతంలో సీఎం క్యాంప్ ఆఫీసులు ఎక్కడెక్కడ ఉన్నాయో సమగ్ర వివరాలతో శుక్రవారానికి అఫిడవిట్ వేయాలని… విచారించి నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం సూచించింది. జూన్ 16, 17వ తేదీలలో రాజధాని బిల్లులపై అసెంబ్లీ, మండలిలో జరిగిన కార్యకలాపాలను తెప్పించాలని ఎమ్మెల్సీ అశోక్ బాబు వేసిన పిటిషన్‌లో వాదనలు వినిపించిన న్యాాయవాది జంధ్యాల కోరారు. రాజ్యాంగ విరుద్ధంగా వాటిని ఆమోదింపచేసుకున్నారని ఆడియో, వీడియో ఫుటేజీతోపాటు బ్లూ పేపర్స్, బిల్స్ రిజిస్టర్ లను కూడా తెప్పిస్తే మొత్తం విషయం బయటపడుతుందన్నారు. దీంతో ధర్మాసనం శుక్రవారానికి మొత్తం వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
రాజధానిలో ఇళ్ల స్థలాల పంపిణీ కేసును ముందుగా విచారించాలని ప్రభుత్వ తరపు న్యాయవాదులు ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. అలాగే రాజధానికి సంబంధించి కోస్తా, రాయలసీమ ప్రజల తరపున ఇంప్లీడ్ అయ్యేందుకు అవకాశం కల్పించాల్సిందిగా ఆయా ప్రాంతాలకు చెందిన కొందరు లాయర్లు పిటిషన్లు వేశారు. వారి అభ్యర్థనలను కోర్టు అంగీకరించింది.