కేంద్ర కేబినెట్లో చేరమని బీజేపీ బతిమాలుతోందని కానీ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా తాము మంత్రి పదవుల్ని తృణప్రాయంగా త్యజిస్తున్నామని వైసీపీ నేతలు ప్రచారం చేసుకోవడం ప్రారంభించారు. ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ఖరారయన దగ్గర్నుంచి ఓ వర్గం మీడియాలో.. ఆ భేటీ ఎన్డీఏలోకి వైసీపీలోకి ఆహ్వానించాడనికేనన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకటి కాదు..రెండు కాదు.. ఏకంగా మూడు మంత్రి పదవులు.. అందులో రెండు కేబినెట్ ర్యాంక్ పదవులను హోంమంత్రి అమిత్ షా, ప్రధాని మోదీ ఆఫర్ చేశారని చెప్పుకున్నారు. కీలకమైన శాఖలే ఇస్తారని కూడా హామీ ఇచ్చారని మీడియాకు లీక్‌లు ఇచ్చేశారు.
కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రమే.. తటపటాయిస్తున్నారని.. అంతిమంగా చేరే అవకాశం లేదని చెప్పుకొస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలిచి.. ఎన్డీఏలో చేరమని అడిగితే.. కుదరదని చెప్పేంత ఫ్లెక్సిబులిటీ జగన్మోహన్ రెడ్డికి లేదని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. బీజేపీ ప్రేమిస్తే… వైసీపీ ప్రేమించాల్సి వస్తుందనేది… ఎవరూ కాదనలేని నిజమని అంటున్నారు. ఇటీవల అకాలీదళ్ మిత్రపక్ష కూటమి నుంచి వైదొలగడం..రాజ్యసభలో వైసీపీ ఎంపీల అవసరం ఉండటంతో ఈ మేరకు ఎన్డీఏలోకి వైసీపీని ఆహ్వానించారనడానికి లాజిక్ ఉందని అంటున్నారు.
కానీ.. ప్రస్తుతానికి ఎలాంటి మిత్రపక్షాలను పిలిచి మరీ చేర్చుకోవాల్సిన అవసరం లేదని అమిత్ షా , మోడీ భావిస్తున్నారని.. కొత్తగా మంత్రివర్గ విస్తరణ జరిపినా అది బీజేపీకి మాత్రమే పరిమితవుతుందని చెబుతున్నారు. మొత్తానికి ఎలాంటి మంత్రిపదవులు వచ్చే అవకాశం లేకపోయినా… ఇస్తామన్నారు కానీ వద్దన్నాం అనే భావన కల్పించడానికి వైసీపీ అంతర్గత మీడియా విభాగం చేయాల్సినంత ప్రయత్నం చేస్తోందని.. వారికి అనుకూలంగా ఉండే మీడియా సహకరించిందని చెబుతున్నారు.