రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఆపకపోతే కృష్ణానీరు దిగువకురాకుండా బ్యారేజీ నిర్మిస్తామని ఏపీ సర్కార్‌కు కేసీఆర్ హెచ్చరికలు జారీ చేశారు. అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఏం జరిగిందన్నదానిపై ఆలస్యంగా వివరాలు బయటకు వస్తున్నాయి. అపెక్స్ కమిటీ భేటీలో కేసీఆర్ .. ఏపీ సీఎం తీరుపై ఫైరయినట్లుగా తెలంగాణ ప్రభుత్వ వర్గాలు మీడియాకు సమాచారం ఇచ్చాయి. తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన జలవివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్ అపెక్స్ కౌన్సిల్ భేటీని ఏర్పాటు చేశారు. సమావేశలో సమావేశంలో ఏపీ ప్రభుత్వానికి కేసీఆర్ ఘాటు హెచ్చరిక చేసినట్లుగా తెలుస్తోంది. కృష్ణానదిపై పోతిరెడ్డిపాడు లాంటి అక్రమ ప్రాజెక్ట్‌లు ఆపకుంటే.. గోదావరిపై మహారాష్ట్ర బాబ్లీని నిర్మించినట్లే.. కృష్ణానదిపై ఆలంపూర్- పెద్దమరూర్ వద్ద బ్యారేజీ నిర్మిస్తామని తేల్చి చెప్పారు. రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం ఖాయమని..ఎవరూ ఆపలేని స్పష్టం చేశారు.
నదీజలాల విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అన్యాయం చేసినట్టే.. ఇప్పుడూ చేస్తే కుదరదని.. తెలంగాణ నీటివాటాను కొల్లగొట్టాలని చూస్తే.. ఎంతకైనా సిద్ధమని హెచ్చరించారు. అక్రమ ప్రాజెక్ట్‌లను నిలిపివేయాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చినా.. రాయలసీమ లిఫ్ట్‌ను ఏపీ కొనసాగించడం బాధాకరమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. పోతిరెడ్డిపాడు కెనాల్‌ను తెలంగాణ ఉద్యమకాలం నుంచే వ్యతిరేకిస్తున్నామని.. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా.. పోతిరెడ్డిపాడును మరింత విస్తరించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లు గడుస్తున్నా.. కేంద్రం నీటి కేటాయింపులు జరపలేదని.. అసంతృప్తి వ్యక్తం చేశారు. బేసిన్ అవతలికి కృష్ణా జలాలను తరలించే వీలు ఏపీకి లేదన్నారు.
తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులేవీ కొత్తవి కావని.. ప్రాజెక్ట్ డిజైన్లలో స్వల్ప మార్పులు మాత్రమే చేశామని.. డీపీఆర్‌లు ఇవ్వడానికి అభ్యంతరం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. కాళేశ్వరం, పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్‌లపై అనుమతులపైనా కేసీఆర్, జగన్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. కాళేశ్వరంలో మూడో టీఎంసీ ఎత్తిపోతలకు అనుమతులు లేవని జగన్ సమావేశంలో వ్యాఖ్యానించారు. అయితే జగన్ వ్యాఖ్యలపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడుకు అసలు అనుమతులే లేవని స్పష్టం చేశారు. అసలు మొదటి ప్రాజెక్ట్ అయిన పోతిరెడ్డిపాడుకే అనుమతి లేనప్పుడు.. రెండోదిగా రాయలసీమ ఎత్తిపోతల ఎలా చేపడుతారని కేసీఆర్ ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.