కొన్ని కాంబినేషన్ల కోసం అభిమానులే కాదు, చిత్రసీమ యావత్తూ ఆసక్తిగా ఎదురు చూస్తుంటుంది. అలాంటి కాంబోల్లో మహేష్ – త్రివిక్రమ్‌లది ఒకటి. వీరిద్దరూ జాయింటుగా రెండు సినిమాలు తీశారు. ఒకటి.. అతడు, రెండోది ఖలేజా. నిజం చెప్పాలంటే అతడు థియేటర్లలో కంటే, టీవీల్లో ఎక్కువగా ఆడింది. ఖలేజా థియేటర్లలో నడవలేదు కానీ, టీవీల్లో తెగ చూశారు. కమర్షియల్ గా పే బ్యాక్ చేసిన సినిమాలు కావివి. అయినా సరే.. ఈ రెండు సినిమాలూ ఓ మార్క్‌ని క్రియేట్ చేశాయి. అందుకే ఈ కాంబో హ్యాట్రిక్ ఎప్పుడు కొడుతుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇప్పుడు మహేష్ కూడా ఈ కాంబినేషన్ పై క్లారిటీ ఇచ్చేశాడు. `అతి త్వరలోనే మా కాంబినేషన్ రాబోతోంది` అంటూ హింట్ ఇచ్చేశాడు. ఖలేజా విడుదలై ఈరోజుకి పదేళ్లు. ఈ సందర్భంగా అభిమానులంతా ఖలేజా జ్ఞాపకాల్లో మునిగిపోయారు. మహేష్ కూడా.. ఖలేజా నాటి వర్కింగ్ వీడియో ఒకటి అభిమానులతో పంచుకున్నాడు. ఈ సినిమాతోనే నటుడిగా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నానని, ఇదంతా త్రివిక్రమ్ వల్లే అని గుర్తు చేసుకున్నాడు. తమ తదుపరి సినిమా అతి త్వరలో రానున్నదని, దాని కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ట్వీట్ చేశాడు. ఇటీవల మహేష్ – త్రివిక్రమ్ మధ్య కొన్ని చర్చలు నడిచాయి. వీరి కాంబో ఖాయమని వార్తలొచ్చాయి. మహేష్ ట్వీట్ చూస్తుంటే, అతి త్వరలో ఆ శుభవార్త చెవిన పడేలానే ఉంది.