ప్రతీ చిన్న విషయంలోనూ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డినే ఆదర్శంగా తీసుకుంటారు జగన్. తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చి, తండ్రి పేరు చెప్పి ఓట్లు తెచ్చుకుని, ఆ తరవాత అధికారంలోకి వచ్చాక కూడా.. ప్రతీ పథకంలోనూ, ఆ పథక ప్రచారంలోనూ వైఎస్ పేరుని వాడుకుంటూ – ఒక్క విషయంలో మాత్రం తండ్రిని అనుసరించలేకపోతున్నారు జగన్. తండ్రిలో ఉన్న స్పోర్టివ్ నెస్ జగన్‌లో లేదేమో అన్నదే అందరిలోనూ అనుమానం. దానికి.. `అదిరింది` ఎపిసోడే నిదర్శనం.
జీ తెలుగులో ప్రసారమయ్యే.. అదిరింది షోలోని ఓ ఎపిసోడ్ ఇటీవల జగన్ అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. ఈ షోలో ఓ నటుడు జగన్ ని, ఆయన మేనరిజాన్ని అనుకరించడమే పెద్ద తప్పయిపోయింది. నిజానికి అది చాలా చిన్న స్కిట్టు. అందులో జగన్ పాత్రని ఇమిటేట్ చేసింది కొన్ని నిమిషాలు. ఈ మాత్రం దానికే… జగన్ అభిమానుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నటీనటులకు, ఈ షోలో పాల్గొన్న మిగిలిన వాళ్లకూ.. శ్రద్దాంజలి ఘటించేశారు. అమ్మ – ఆలి బూతులు మొదలెట్టారు. జగన్ ని అనుసరించిన నటుడు సోషల్ మీడియా ముందుకొచ్చి క్షమాపణలు కూడా చెప్పాడు. అయినా జగన్ ఫ్యాన్స్ ఊరుకోవడం లేదు. సోషల్ మీడియాలో.. బండ బూతులు తిడుతున్నారు. అసలు ఈ వ్యవహారంతో సంబంధం లేనివాళ్లని కూడా లాగుతున్నారు.
ఈ స్కిట్ అయిపోయాక.. నాగబాబు `అందర్నీ ఇమిటేట్ చేశావ్.. మా అన్నయ్యనీ, తమ్ముడినీ వదిలేశావ్` అంటూ ప్రోత్సహించడం కనిపించింది. `మా వాళ్లనీ చేస్తే మేం ఎంజాయ్ చేస్తాం కదా` అన్నది నాగబాబు పాయింట్. స్పోర్టివ్ నెస్ అంటే అలా ఉండాలి. అంతెందుకు… వైఎస్ఆర్ కూడా చాలా స్పోర్టివ్ గా ఉండేవారు. నంది అవార్డు ఫంక్షల్లో సాక్ష్యాత్తూ వైఎస్ఆర్ ముందే శివారెడ్డి ఆయన్ని అనుకరించి నవ్వించాడు. శివారెడ్డి మిమిక్రీ చేస్తున్నంత సేపూ.. వైఎస్ఆర్ నవ్వుతూనే ఉన్నారు. `బాగా చేశావయ్యా..` అంటూ శివారెడ్డినీ మెచ్చుకున్నారు. ఆ స్పోర్టివ్ నెస్ జగన్ లో, ఆయన అభిమానుల్లో కనిపించాలి కదా..? అన్ని విషయాల్లోనూ వైఎస్ఆర్ ని ఆదర్శంగా చెప్పుకునే వీళ్లంతా.. ఈ ఒక్క విషయంలోనూ ఆయన్ని అనుసరిస్తే ఇంత గొడవ ఉండేది కాదు.