వైసీపీలో మరో లేఖల ఎంపీ తయారయినట్లుగా కనిపిస్తోంది. టీడీపీ హయాంలో గొప్పగా పనులు జరిగాయని ఇప్పుడు పడకేశాయని .. ఓ సారి చూసుకోవాలనే అర్థంతో నర్సారావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయులు నేరుగా సీఎం జగన్కు లేఖ రాశారు. తిరుపతి బర్డ్ ఆస్పత్రిలో ఎనిమిది నెలలుగా మోకాళ్ల మార్పిడి ఆపరేషన్లు నిలిచిపోయాయని..వెంటనే ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని నర్సరావు పేట ఎంపీ లావు కృష్ణదేవరాయులు … ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. 2016 నుంచి 2019 వరకు బర్డ్ ఆస్పత్రిలో పదివేల మోకాళ్ల మార్పిడి ఆపరేషన్లు జరిగాయని కానీ… గత ఎనిమిది నెలల కాలంలో ఒక్కటంటే ఒక్కటీ జరగలేదని ఎంపీ తన లేఖలో సీఎంకు తెలిపారు. వైట్ రేషన్ కార్డు ఉన్న వారికి ఉచితంగా టీటీడీ ఆధ్వర్యంలో నడిచే బర్డ్ ఆస్పత్రిలో ఆపరేషన్లు చేస్తూంటారు. అయితే ఆ ఆపరేషన్లు టీటీడీ నిధులతో కాకుండా… దాతలు ఇచ్చే విరాళలలో నిర్వహిస్తూ ఉంటారు.
బర్డ్ ఆస్పత్రికి విదేశాల నుంచి పెద్ద ఎత్తున విరాళాలు వస్తూంటాయి. ప్రత్యేకంగా ఈ మోకాలు ఆపరేషన్లు చేయించుకునే పేదలకు సాయంగా ఎన్నారైలు విరాళాలు పంపిస్తూ ఉంటారు. ఆ విరాళాల సాయంతో పేదలకు వైద్యం చేస్తూంటారు. ఒక్క రూపాయి కూడా పేదల నుంచి వసూలు చేయరు. కానీ ఇటీవల కేంద్రం విదేశాల నుంచి వచ్చే విరాళాల స్వీకరణ విషయంలో కొన్ని నిబంధనలు పెట్టింది. ఎఫ్సీఆర్ఏ చట్టం ప్రకారం.. విరాళాలు అందుకునేవారు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
అయితే విరాళాలు రాకపోయినా పర్వాలేదు.. పేదలకు వైద్యం..ఆపరేషన్లు అందకపోయినా తమకేం పోయింది అనుకున్నారేమో కానీ ప్రభుత్వం వైపు నుంచి ఎఫ్ఆర్సీఏ రిజిస్ట్రేషన్ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఫలితంగా బర్డ్ ఆస్పత్రికి విరాళాలు నిచిపోయాయి. ఈ కారణంగా ఆపరేషన్లు కూడా ఆగిపోయాయి. నర్సరావుపేట ఎంపీ కృష్ణదేవరాయులు ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి లేఖ ద్వారా తీసుకెళ్లారు. బర్డ్ ఆస్పత్రిలో ఇలాంటి ఆపరేషన్లు చేయకపోవడం వల్లపేదలకు.. అప్పులు చేసి ప్రైవేటు ఆస్పత్రుల్లో చూపించుకోవాల్సివస్తోందని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
వైసీపీ ఎంపీనే ఇలాంటి లేఖ రాయడం… గత ప్రభుత్వ హయాంలో పేదలకు పెద్ద ఎత్తున అందిన సాయం.. ప్రస్తుతం అసలు అందడం లేదన్న అర్థంలో లేఖ ఉండటం .. వైసీపీలోనూ కలకలం రేపుతోంది. సాధారణం ఇలాంటి లేఖల విషయంలో రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ముందుఉన్నారు . ఇప్పుడు కృష్ణదేవయలు కూడా బయటపడుతున్నారా.. అన్న చర్చ ప్రారంభమయింది.