చిన్నపాటి వరద వస్తేనే రాజధాని అమరావతి మునిగిపోతుందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తేల్చేశారు. ఇప్పటికి ఎన్నో సార్లు వరదలు వచ్చినా ఎన్ని సార్లు అమరావతి మునిగిందో మాత్రం ఆళ్ల చెప్పలేదు కానీ… ఆయన మాత్రం తన నియోజకవర్గంలో ఉన్న రాజధాని పనికి రాదని సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు. రాజధానికి అమరావతి సరైంది కాదని కూడా తేల్చేాసరు. ఇదే విషయాన్ని శివరామకృష్ణ కమిటీ కూడా చెప్పిందని కొత్త విషయం కూడా చెబుతున్నారు. నిజానికి గుంటూరు,విజయవాడ మధ్య రాజధాని ఉండాలని ఎక్కువ మంది కోరుకున్నారని శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది.
చంద్రబాబు అవినీతి కోసమే అమరావతి నిర్మాణం చేపట్టారని.. అయితే అమరావతి శాసన రాజధానిగా కొనసాగుతుందని.. అలాగే సీఎం నివాసం కూడా ఇక్కడే ఉంది కాబట్టి రైతులకు ఇంకేం కావాలని ఆయన ప్రశ్నిస్తున్నరు. ఏదో గొప్ప ఉపకారం చేసినట్లుగా ఇంకా అమరావతి ప్రాంత రైతులు ఎందుకు పట్టుబడుతున్నారు.. స్థానిక రైతులకు ఇది మంచి పద్ధతి కాదని కూడా హితవు పలికారు. మంగళగిరిలో ఓ కులసంఘం సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమరావతిని నిర్ణయించినప్పుడు.. ఆయనే మంగళగిరి ఎమ్మల్యేగా ఉన్నారు. ఏ రోజు కూడా ఆయన రాజధానిగా తన నియోజకవర్గం పనికి రాదని చెప్పలేదు.
ఎన్నికల ప్రచారంలో కూడా రాజధాని తరలిపోదని.. జగన్మోహన్ రెడ్డి తనకు చెప్పారని.. కూడా చెప్పుకొచ్చారు. తీరా ఎన్నికల్లో రెండో సారి గెలిచి..ఇప్పుడు.. అమరావతి రాజధానిగా పనికి రాదని చెప్పడమే కాదు.. దశాబ్దాలుగా అక్కడే నివసిస్తున్న వారికే..వర్షాలు వస్తే మునిగిపోయే ప్రాంతం అని వారికే చెబుతున్నారు. ఆర్కే మాటలు విని నోరెళ్లబెట్టి.. పటపటా పళ్లు కొరుక్కోవడం తప్ప.. మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఏమీ చేయలేరు. అలా చేసినట్లు పైకి కూడా కనిపించలేరు ..ఎందుకంటే..అలా చేసినా కేసులపాలవుతారు మరి..!