ముఖ్యమంత్రి సహాయనిధికి చెందిన మూడు చెక్కులతో రూ. 117 కోట్లు కొట్టేయాలని ప్లాన్ చేసిన వ్యవహారంలో పోలీసులు నింపాదిగా చేస్తున్న దర్యాప్తులో చివరికి ప్రొద్దుటూరు దగ్గరే తేలుతోంది. మొత్తం చెక్కుల ఫోర్జరీ సహా మొత్తం గూడుపుఠాణి కడప జిల్లా నుంచే సాగిందని.. మూడుదిక్కుల్లో ఉన్న మూడు రాష్ట్రాల బ్యాంకుల్లో చెక్కులు వేయడం దగ్గర్నుంచి ఎవరికీ అనుమానం రాకుండా… మేనేజ్ చేసే స్కెచ్ వేయడం వరకూ అన్నీ.. ప్రొద్దుటూరు కేంద్రంగానే జరిగాయని దర్యాప్తు సంస్థలు గుర్తించినట్లుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఈ దందా చేయించింది మొత్తం ఓ ఎమ్మెల్యే అనుమానాలు బలపడుతున్నాయి.
ఢిల్లీ, కోల్కతా, బెంగళూరుల్లో మూడు చెక్కులు వేశారు. ఆ చెక్కులు ఎవరు వేశారు.. ఏ సంస్థల పేరుతో వేశారో పరిశోధించి.. వారిని పోలీసులు పట్టుకున్నారు. దాంతో గుట్టురట్టయ్యే పరిస్థితి ఏర్పడింది. అటు సీఐడీ.. ఇటు ఏసీబీ రెండూ ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నాయి. మొత్తంగా కేసు చిక్కుముళ్లు అన్నీ విప్పుకుంటూ వస్తే వైసీపీ ఎమ్మెల్యే వద్దకు ఆ కేసు చేరుతోంది. దీంతో దర్యాప్తు అధికారులకు చెమటలు పట్టేస్తున్నాయి. అయితే ఎమ్మెల్యేపై.. అందునా కడప జిల్లా ఎమ్మెల్యేపై అలాంటి ఆరోపణలు వస్తే.. అసలు ఊరుకుంటారా..? బయటకు రానిచ్చే అవకాశం లేదు. అందుకే.. ఆయన పీఏను బుక్ చేసే దిశగా ప్రస్తుతానికి కేసు రూటు మార్పు ప్రయత్నాలు జరుగుతున్నాయని .. సచివాలయంలో జోరుగా ప్రచారం సాగుతోంది.
కరోనా కారణంగా టార్గెట్ పెట్టుకుని మరీ వైసీపీ నేతలు ముఖ్యమంత్రి సహాయ నిధికి.. నియోజకవర్గానికి రూ. కోటి చొప్పున విరాళాలు సేకరించి అందచేశారు . ఆ నిధులు దండిగా ఉండటంతో… నకిలీ చెక్కులతో దోపిడీకి ప్లాన్ చేశారని సులువుగా అర్థమైపోతుంది. అయితే.. ఆ ఎమ్మెల్యేకి లేదా.. ఎమ్మెల్యే పీఏకి ఇంత పెద్ద మొత్తంలో నొక్కేయాలనే ఆలోచన రావడం అసాధ్యం. ఎందుకంటే.. అది చిన్నమొత్తం కాదు. పైగా చేస్తోందని పట్టపగలు దోపిడీ. బయటకు తెలియకుండా మ్యానేజ్ చేయవచ్చన్న ఉద్దేశంతోనే ఈ స్కాం చాలా పెద్ద స్థాయిలో జరిగిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. సీఎంఆర్ఎఫ్ నిధులకు పెద్దగా ఆడిటింగ్ జరగదు. ఈ కారణంగా కొట్టేయాలని అనుకున్నారు. దీనిపై అధికారులు నిష్ఫాక్షిక విచారణ జరిపితే.. ఎమ్మెల్యే పీఏ.. ఎమ్మెల్యేనే కాకుండా.. ఇంకా పెద్ద తలకాయలు బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. అయితే అందరూ అధికార పార్టీకి చెందిన వారే కాబట్టి.., కనీసం పరువు పోకుండా ఉండటానికైనా సరే.. విచారణలో మ..మ అనిపిస్తారన్న అభిప్రాయం ఏర్పడుతోంది. ఈ కేసులో నిజాలు.. ప్రభుత్వం మారిన తర్వాతే వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు.