రెండు నెలల్లో ఉద్యోగులకు, పెన్షనర్లకు కోత వేసిన పెండింగ్ జీతాలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. వాటిపై వడ్డీ కూడా చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ రెండు నెలల గడువు మరో మూడు రోజుల్లో ముగిసిపోతుందనగా సీఎం జగన్ సమీక్ష జరిపి… ఐదు వాదాల్లో పెండింగ్ జీతాలు చెల్లించాలని నిర్మయించారు. దీనికి ఉద్యోగసంఘాల నేత… ప్రభుత్వం విషయంలో తమకు “సామాజిక” బాధ్యత ఉందని గర్వంగా ఉందని గర్వంగా ప్రకటించుకునే వెంకట్రామిరెడ్డి .. అదే బాధ్యతతో ఓకే చెప్పి వచ్చేశారు. హైకోర్టు ఆదేశించిన వడ్డీ చెల్లింపు గురించి మాత్రం ఏం ప్రకటించలేదు. అలాగే పెండింగ్లో ఉన్న ఐదు డీఎల్లో ఒక్కటి ఇస్తామని సీఎం జగన్ చెప్పే సరికి… అదే మహాప్రసాదం అన్నట్లుగా వెంకట్రామిరెడ్డి అంగీకరించారు.
పొరుగున ఉన్నతెలంగాణ ప్రభుత్వం మూడు నెలల పాటు జీతాల్లో కోత విధించింది. ఈ కారణంగా మూడు నెలల్లో జీతాల వాయిదాలు.. రెండు నెలల్లో పెన్షన్ వాయిదాలు చెల్లించాలని నిర్ణయించింది. అయితే రెండు నెలలు మాత్రమే జీతాల్లో కోత విధించిన ఏపీ సర్కార్.. ఆ రెండు నెలల బకాయిలను ఐదు నెలల పాటు చెల్లించేందుకు నిర్ణయించింది. అదే సమయంలో హైకోర్టు ఉత్తర్వుల విషయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదు. హైకోర్టులో ప్రభుత్వం రివ్యూ పిటిషన్ అయినా వేయాలి..లేదా సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ అయినా తెచ్చుకోవాలి. ఈ విషయంలో ప్రభుత్వం ఆలోచన సుప్రీంకోర్టు దిశగానే ఉందని చెబుతున్నారు.
జీతాల చెల్లింపు విషయంలో హైకోర్టు ఆర్డర్ పై సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని ఇప్పటికే ప్రాథమికంగా నిర్ణయించుకున్నారు. ఐదు వాయిదాల్లో చెల్లించడానికి ఉద్యోగ సంఘాలు కూడా అంగీకరించాయని వెంకట్రామిరెడ్డితోనే ఓ ఇంప్లీడ్ పిటిషన్ వేయిస్తారని చెబుతున్నారు. అదే సమయంలో తమకు వడ్డీ వద్దు అని వెంకట్రామిరెడ్డి వాదించే అవకాశం ఉంది. ఉద్యోగులు ఎవరూ నోరు మెదిపే అవకాశం లేదు. అలా నోరు మెదిపిన వారికి ఉద్యోగం ఉంటుందనే గ్యారంటీ లేదు. అందుకే వెంకట్రామిరెడ్డి చెప్పినట్లుగా నడుస్తుంది. అయితే హైకోర్టు ధిక్కరణ కాకుండా ఎలా చేయాలన్నదానిపై ప్రభుత్వంలో కసరత్తు మాత్రం నడుస్తోంది.