ఆంధ్రప్రదేశ్ మంత్రి గుమ్మనూరు జయరాం చిక్కుల్లో పడిపోయారు. ఆయన కుటుంబసభ్యులు వందల ఎకరాలు కొనుగోలు చేశారు. అయితే ఆ కొనుగోలు కోసం… తాను సొమ్మును నగదు రూపంలో చెల్లించినట్లుగా డాక్యుమెంట్ రిజిస్టర్ చేసుకున్నారు. మామూలుగా అయితే రూ. రెండు లక్షలు మాత్రమే నగదు రూపంలో ఇచ్చిపుచ్చుకోవాలి. అంత కంటే ఎక్కువ అయితే.. ఖచ్చితంగా చెక్కుల ద్వారా ఉండాలి. కానీ ఇక్కడ దాదాపుగా రూ. కోటిన్నర వరకూ నగదు లావాదేవీలను జయరాం కుటుంబసభ్యులు నిర్వహించారు. అదెలా సాధ్యమయింది..? అధికారులు ఎలా ఆమోదించారు..? లాంటి ప్రాథమిక అనుమానాలు వస్తున్నాయి. అయితే… అంతకు మించి అసలు.. ఆ సొమ్ము మంత్రి జయరాంకు ఎలా వచ్చిందన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది.
మంత్రి జయరాం ఎన్నికల ఆఫిడవిట్ ప్రకారం.. ఆయన చాలా వేలల్లోనే. ఆయన భార్యకు అసలు ఆదాయం లేదు. ఆస్తులూ పెద్దగా లేవు. కొద్ది రోజుల కిందట… ఈ భూబాగోతంపై వివాదం వచ్చినప్పుడు… జయరాం తన తరపున ఓ ఎదురుదాడి వివరణ ఇచ్చారు. అవును.. తన కుటుంబసభ్యులు వంద ఎకరాలు కొనుగోలు చేశారు.. అయితే ఏంటి..? అని ప్రశ్నించారు. అప్పుడే తెలుగు 360 ఆయన ఎన్నికల అఫిడవిట్‌ను పరిశీలించి వివరాలను వెల్లడించింది. అప్పట్లో మంత్రి చేసిన వాదనపై తెలుగు360 కథనాన్ని ఈ లింక్‌లో చూడొచ్చు.
Read Also :ఆ మంత్రి ఆదాయం లక్షన్నర.. అయినా వంద ఎకరాలు కొనేశాడట..!
ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీల నేతలు ఇదే అంశాన్ని హైలెట్ చేస్తున్నారు. ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడు ఇరికించి.. అసలు లంచాలు మాత్రం జయరాం తీసుకున్నారని.. ఆ సొమ్ముతోనే ఆస్తులు కొనుగోలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం.. ఈ నగదు వ్యవహారం జయరాం మెడకు చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. తాము చెల్లించినట్లుగా చెబుతున్న నగదును ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. తనపై వరుసగా వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పుకోలేకపోతున్న మంత్రి.. బీసీ కార్డును బయటకు తీస్తున్నారు. అయితే.. అవినీతికి పాల్పడితే ఎవర్నీ సహించబోమని.. జగన్ గతంలో చాలా సార్లు ప్రకటించారు. ఇదే వైసీపీలో చర్చనీయాంశం అవుతోంది.