స్థానిక ఎన్నికల నిర్వహణ ఇప్పుడు కుదరదని ఏపీ ప్రభుత్వం అనూహ్యమైన అభిప్రాయాన్ని హైకోర్టుకు తెలియచేయడంతో కొత్త రాజకీయ కలకలం రేగడానికి కారణం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కరోనా .. గిరోనా జాన్తా ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందేనని పట్టుబట్టిన ప్రభుత్వం ఇప్పుడెందుకు యూటర్న్ తీసుకుందో.. చాలా మందికి అర్థం కావడం లేదు. కానీ ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగితే.. తాము “స్వీప్” చేయలేమని భావిస్తున్నందునే.. ప్రజలు ఏమైనా అనుకుంటారనే ఆలోచన కూడా లేకుండా… ఎన్నికల నిర్వహణ విషయంలో యూటర్న్ తీసుకున్నట్లుగా భావిస్తున్నారు.
వాస్తవానికి ఎన్నికలు నిర్వహించాలా వద్దా అన్నది ఎస్ఈసీ ఇష్టం. ఆయన నిర్ణయమే ఫైనల్. అసలు ప్రభుత్వాన్ని హైకోర్టు ఎలాంటి అభిప్రాయం అడగలేదు. కానీ.. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పిటిషన్‌పై తన అభిప్రాయం చెప్పేసింది. అందుకే హైకోర్టు కూడా.. ఆ విషయం మీరెలా చెబుతారని ప్రశ్నించి… వెళ్లి ఎస్ఈసీకి చెప్పాలని సూచించింది. ఎస్ఈసీకి కూడా నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు ఎస్ఈసీ నిర్ణయమే ఫైనల్. ఆయన ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటే ఎవరూ ఆపలేరు. ఎందుకంటే ఇప్పుడు కరోనా లాక్ డౌన్ పూర్తయిపోయింది. అన్ లాక్ వచ్చేసింది. ఎన్నికలు కూడా ఇతర చోట్లా జరుగుతున్నాయి. నిమ్మగడ్డ ఎన్నికలు వాయిదా వేసినప్పుడు కరోనా ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇప్పుడు తీసేశారు.
అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు నిర్వహించాలంటే.. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సహకరించాల్సి ఉంటుంది. సాధారణంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే.. యంత్రాంగానికి ఎస్ఈసీనే చీఫ్ అవుతారు. ఎన్నికలు పూర్తయ్యే వరకూ ఆయన ఆదేశాలు పాటించాల్సిందే. కానీ ఆంధ్రప్రదేశ్ అధికార యంత్రాంగం తీరు భిన్నంగా ఉంది. వారు .. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదు.. ఇక ఎస్ఈసీ ఆదేశాలను అమలు చేస్తారనుకోవడం భ్రమ. ఇలాంటి సమయంలో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు. ఎస్ఈసీ నిమ్మగడ్డ ఎన్నికలు నిర్వహించాలనుకున్నా.. ఎన్నికలు నిర్వహించలేకపోతే.. అంత కన్నా రాజ్యాంగ సంక్షోభం మరొకటి ఉండదు.
న్యాయపోరాటం చేసి తన పదవి దక్కించుకున్న తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఎన్నికల నిర్వహణపై దృష్టి పెట్టారు. పాత నోటిఫికేషన్ కొనసాగించాలా.. లేక కొత్తగా ఏమైనా చేయాలా అన్నదానిపై కసరత్తు చేస్తున్నారు. కేంద్ర బలగాల భద్రతను గతంలోనే కోరారు. ఈ తరుణంలో నిమ్మగడ్డ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది సంచలనాత్మకం అవుతుంది. ఎన్నికలు నిర్వహించాలనుకుంటే.. మాత్రం.. ప్రభుత్వం నుంచి సహాయనిరాకరణ ఎదురవుతుంది. అదే జరిగితే… స్వతంత్ర భారత చరిత్రలో కనీవినీ ఎరుగని రాజ్యాంగ సంక్షోభం ఏర్పడినట్లుగా అవుతుంది.