ప్రతీ సినిమానీ ఓ కలలానే భావిస్తాడు రాజమౌళి. అందమైన కలల లోకాన్ని సృష్టిస్తాడు. భావోద్వేగాల్ని మేళవిస్తాడు. మాస్‌ని మెప్పిస్తాడు.క్లాస్ తో కూడా ఈలలు వేయిస్తాడు. మొత్తానికి సినిమా పేరుతో ఓ మాయాజాలం సృష్టిస్తాడు. అదే.. రాజమౌళి.. రాజమోళి. మగధీర, ఈగ, బాహుబలి – అన్నీ అందమైన కలలే. వాటిని అద్భుతాలుగా మార్చాడు. ఇప్పుడు రాజమౌళి వైపు దేశం అంతా చూస్తోందంటే కారణం.. అదే. అలాంటి రాజమౌళికి ఓ కల ఉంటే, ఆ కల ఇంకెంత బాగుంటుంది? ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తుంది?
రాజమౌళి ఇప్పుడు కంటున్న కల.. మహాభారతం. ఎప్పటికైనా మహాభారతాన్నివెండి తెరపై ఆవిష్కరిస్తానంటున్నాడు రాజమౌళి. మహాభారత గాథని చాలాసార్లు వెండి తెరపై చూశాం. కానీ ఈసారి దానికి రాజమౌళి మ్యాజిక్ తోడు కానుంది. రాజమౌళి ఆలోచనలన్నీ భారీగానే ఉంటాయి. మహాభారతం తాను ఏకళ్లతో చూశాడో, ఎంత గొప్పగా ఊహించుకున్నాడో – దాన్నే తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నించబోతున్నాడు. నిజానికి మహాభారత గాథని ఎవరు చూపించాలనుకున్నా, అందులో ఓ అంకమో, ఓ పాత్రో ఎంచుకుంటారు. కానీ రాజమౌళి అలా కాదు. మహాభారతంలోకి కీలక ఘట్టాలన్నీ ఓ మాలగా పేర్చి… ఈ సినిమా తీయబోతున్నాడు. అందుకే ఒకటి కాదు.. రెండు కాదు, ఏకంగా 5 భాగాలుగా మహాభారతం తీస్తానని రాజమౌళి ముందే చెప్పేశాడు. అందుకు ఎన్ని వందల కోట్లు అవుతాయో ఇప్పుడే లెక్క వేయడం కష్టం. బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా.. అన్ని భాషల నుంచి నటీనటులు ఈ మహాభారతంలో కనిపించనున్నారు. ఈ ప్రాజెక్టు గురించి అమీర్ ఖాన్ లాంటి వాళ్లు ఆసక్తిని కరబరుస్తున్నారు. తప్పకుండా కళ్లు చెదిరేకాంబినేషన్ `మహాభారతం`లో చూడొచ్చు. అయితే.. ఈ సినిమాతో రాజమౌళి తన సినీ ప్రయాణానికి పుల్ స్టాప్ పెట్టేసినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే రాజమౌళి కంటూ కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. `ఫలానా సంవత్సరం తరవాత..` అంటూ తన కెరీర్‌కి ఓ డెడ్ లైన్ పెట్టుకున్నట్టు ఆయన సన్నిహితులు చెబుతుంటారు. మహాభారతంతో మరో చరిత్ర లిఖించి – సినిమాల నుంచి విరామం తీసుకోవాలన్నది రాజమౌళి ప్లాన్. కాకపోతే.. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చడానికి మరో ఐదేళ్లయినా పడుతుంది. అప్పటికి టెక్నాలజీ మరింత మారుతుంది. మరింత గొప్పగా ఈ కథని.. తెరపై చూసే అవకాశం ప్రేక్షకులకు కలుగుతుంది. ఆ తరుణం కోసం.. దేశం మొత్తం ఎదురు చూస్తోంది.