చంద్రబాబు.. చంద్రబాబు..! అన్నీ చంద్రబాబే చేస్తున్నాడు..! కరోనా కేసులు పెరిగినా చంద్రబాబే చేస్తాడు. కోర్టు తీర్పులు అనుకూలంగా రాకపోయినా చంద్రబాబే చేస్తాడు..! నిజంగా అన్నీ చంద్రబాబే చేస్తే.. ఆయన ఎందుకు ఇంట్లో ఖాళీగా కూర్చుని ఉంటాడు. మోడీతో సంబంధాలు చెడగొట్టుకుని .. ఉన్న పదవి పోగొట్టుకుని… గోళ్లు గిల్లుకుంటూ ఎందుకు ఉంటారు…? . అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేయగలిగిన పరిస్థితుల్లో ఉంటే.. ఎన్నికలకు ..కౌంటింగ్‌కు మధ్యలో తాను సీఎంగా ఉన్నప్పటికీ.. ఆపన్నుల కోసం ఇచ్చిన రూ. 50వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులను కూడా… ఈసీ నియమించిన సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం బౌన్స్ చేస్తే నిస్సహాయంగా ఎందుకు ఉండిపోయారు..?. సీఎంగా ఉండి తాను ఇచ్చిన రూ. 50వేల చెక్కును కూడా సాయంగా క్లియర్ చేయలేకపోయిన నిస్సహాయ స్థితికి చంద్రబాబు ఎన్నికలకు ముందే చేరిపోయాడు. మరి ఇప్పుడెందుకు ఆన్నీ ఆయనే చేస్తున్నాడని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒకటే కనిపిస్తోంది. ఒకే ఒక్క లక్ష్యం కనిపిస్తోంది. అదే చంద్రబాబు. 74 ఏళ్ల వయసులో ఆయన ఎంత కాలం రాజకీయం చేస్తాడో తెలియని పరిస్థితుల్లో ఉన్న చంద్రబాబు మాత్రమే ఏపీ ప్రభుత్వ పెద్దలకు కనిపిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా ఏం జరిగినా.. తాము స్వయంగా తెచ్చి పెట్టుకున్నదే అయినా.. చంద్రబాబే చేయిస్తున్నారని కలవరపడుతున్నారు. నిజంగానే కలవరపడుతున్నారో లేక… అలా ప్రజలను నమ్మించి… చంద్రబాబును బూచిగా చూపి.. తాము గండం గట్టెక్కాలనుకుంటున్నారో కానీ… అన్నింటికీ చంద్రబాబునే బూచిగా చూపించడం ప్రారంభించారు. ఏదైనా మంచి పని జరిగితే… జగనన్న. చేతకాక చేయలేకపోతే… చంద్రబాబు వల్ల.
దేశ రాజ్యాంగం సర్వోన్నతమైనది. అధికారంలో ఉన్న వారికి ఉండే అపరిమితమైన అధికారాలతో వ్యవస్థను భ్రష్టుపట్టించే రాజకీయ నేతలు పెరిగే కొద్దీ… ప్రజాస్వామ్యం బలహీనం అవుతూ వస్తోంది. అదృష్టవశాత్తూ న్యాయవ్యవస్థ ఇప్పటికీ బలంగానే ఉంది. రాజకీయ వ్యవస్థ .. దానిపై దాడి చేయడానికి ఇప్పటి వరకూ సాహసించలేదు. కానీ ఇప్పుడు అది కూడా పోయింది. అవినీతి కేసుల్లో బెయిల్‌పై ఉన్న వ్యక్తి.., రాజ్యాంగం ఇచ్చిన హక్కుతో ఎన్నికల్లో గెలిచి.. చివరికి ఆ న్యాయవ్యవస్థపైనే దాడి చేస్తున్నారు. ఇది అనూహ్య పరిణామం. ఈ దాడికి కూడా… చంద్రబాబే బూచి. హైకోర్టు న్యాయమూర్తులు అయినా తీర్పులు.. రాజ్యాంగం, చట్టం ప్రకారమే ఇస్తారు. దానికి మించి ఇవ్వరు. కానీ.. వాటికి మించి.. తాము తీసుకున్న నిర్ణయాలను సమర్థించకపోతే.. ఆ న్యాయమూర్తులకు చంద్రబాబు ట్యాగ్ అంటించేందుకు ఏ మాత్రం వెనుకాడటం లేదు. సోషల్ మీడియాల్లో నరుకుతా అనే బెదిరిపులు అదనం.
రాజకీయాల పరమార్ధం .. ప్రజలకు మేలు చేయడమే. తమకు ఏ రాజ్యాంగం ప్రకారం అధికారం దఖలు పడిందో.. ఆ రాజ్యాంగాన్ని మరింత బలం చేకూర్చే ప్రయత్నం చేయాలి కానీ.. తగ్గించకూడదు. అలా చేస్తే కూర్చున్న కొమ్మును నరుక్కున్నట్లే. కానీ.. అధికారం మత్తులో… ఇవేమీ చాలా మందికి కనిపించడం లేదు. ఓ వ్యక్తిని బూచిగా చూపి.. వ్యవస్థల్ని నిట్ట నిలువుగా నరికేసే ప్రయత్నం చాలా జోరుగా సాగుతోంది. ఇప్పుడు భారత ప్రజాస్వామ్యం అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. తట్టుకుంటే సరే.. లేకపోతే.. అరాచకత్వానికి కేరాఫ్‌గా మిగిలిపోతుంది… ఇందులో ఎలాంటి సందేహం లేదు..!