`జగదేక వీరుడు – అతిలోక సుందరి`… సోషియో ఫాంటసీల్లో ఇదో క్లాసిక్. చిరు – శ్రీదేవిల జంట, ఇళయరాజా పాటలు, దర్శకేంద్రుడి అందమైన ఊహా ప్రపంచం – ఇవన్నీ ఈ సినిమాని గుర్తుండిపోయేలా చేశాయి. ఈ చిత్రానికి సీక్వెల్ వస్తే బాగుంటుందని అశ్వనీదత్ ఎప్పటి నుంచో చెబుతున్నారు. చరణ్ కీ ఈ సినిమా చేయాలనే వుంది. అయితే.. సరైన లీడ్ దొరకలేదు. ఇన్నాళ్లకు ఈ `జగదేకవీరుడు – అతిలోక సుందరి` సీక్వెల్ కి సరిపడా కథ దొరికిందని సమాచారం. అశ్వనీదత్ – రాఘవేంద్రరావు మధ్య ఈ సీక్వెల్ కి సంబంధించిన డిస్కర్షన్స్సాగుతున్నాయట.
అయితే… ఈ సినిమాకి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించరు. ఆయన దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే చేస్తారు. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్‌కి దర్శకత్వ బాధ్యత అప్పగించే అవకాశం ఉంది. చిరు తనయుడు, రాఘవేంద్రరావు తనయుడు కలిస్తే మంచి ఆలోచనే. అయితే.. శ్రీదేవి తనయని కూడా ఈ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ చేసినప్పుడే ఈ సీక్వెల్ కి పరిపూర్ణత చేకూరుతుంది. అశ్వనీదత్ మనసులోని మాట కూడా అదే. కాకపోతే.. ఇన్నాళ్లూ సరైన కథ దొరక్కపోవడం వల్ల సీక్వెల్ గురించి పెద్దగా ఆలోచించలేదు. ఇప్పుడు అది దొరికేసింది. చరణ్ గనుక ఓకే అంటే.. ఈ సీక్వెల్ పట్టాలెక్కడం ఖాయం. కాకపోతే.. ప్రకాష్‌కి హిట్స్ లేవు. ఈమధ్య చేసిన `సైజ్ జీరో` కూడా డిజాస్టర్ గా మారిపోయింది. బాలీవుడ్ లో ఓ సినిమా మొదలెట్టాడు. అది ఎంత వరకూ వచ్చిందో తెలీదు. ప్రకాష్ డైరెక్షన్ అనేది తప్పిస్తే `నో` చెప్పడానికి చరణ్ దగ్గర కూడా సరైన కారణాలు లేవు. మరి.. ఈ సీక్వెల్ ఎప్పుడు, ఎవరితో తెరకెక్కుతుందో చూడాలి.