శేఖర్ కమ్ముల స్టైలే వేరు. తన సినిమా అంటే చెక్కుడు కార్యక్రమం తప్పకుండా ఉంటుంది. సినిమాని అలా తీసుకుంటూ వెళ్తాడు. నచ్చకపోతే మళ్లీ తీస్తాడు. తనకు నచ్చేంత వరకూ తీస్తూనే ఉంటాడు. శేఖర్ కమ్ముల సినిమా అంటే రీషూట్లకు సిద్ధ పడాల్సిందే. `లవ్ స్టోరీ` విషయంలోనూ ఇదే సీన్రిపీట్ అవుతోంది. నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా `లవ్ స్టోరీ`. లాక్ డౌన్ తరవాత షూటింగ్ మొదటెట్టారు. ఇప్పటికి సినిమా మొత్తం పూర్తవ్వాల్సింది. కానీ శేఖర్ కమ్ముల చెక్కుడు కార్యక్రమం వల్ల – నిరంతరాయంగా షూటింగ్ సాగుతూనే ఉంది.
రషెష్ చూసుకున్న శేఖర్ కమ్ములకు కొన్ని ఇంప్రూవ్మెంట్లు అవసరం అనిపించాయని, వెంటనే రీషూట్లకు రంగం సిద్ధం చేశాడని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో కేవలం రీషూట్లే జరగబోతున్నాయట. అటు చైతూ, ఇటు సాయి పల్లవి సైతం అందుకు మరిన్ని అదనపు డేట్లు ఇచ్చేశారని టాక్. సినిమాని ఇప్పటికిప్పుడు అర్జెంటుగా పూర్తి చేసి ఇవ్వాల్సిన పనిలేదు. రిలీజ్ డేట్ గోల లేదు. అందుకే.. శేఖర్ తనదైన శైలిలోనే నెమ్మదిగా ఈ సినిమాని పూర్తి చేయాలనుకుంటున్నాడట. `ఫిదా` కూడా ఇంతే. చాలా రీషూట్ల తరవాత విడుదలైంది. మంచి విజయాన్ని అందుకుంది. సాయి పల్లవిని తెలుగు ఇండ్రస్ట్రీలో పాతుకుపోయేలా చేసింది. `లవ్ స్టోరీ`లోనూ అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని సాయి పల్లవి నమ్ముతోంది. అందుకే ఎన్ని కాల్షీట్లు కావాలన్నా ఇచ్చుకుంటూ వెళ్తోంది.