ఎవరైనా రోడ్డు విస్తరణకు గజం భూమి ఇవ్వమంటే ఇస్తారా..?. ప్రభుత్వం పరిహారం ఇస్తామన్నా .. వీలైనంతగా ఇవ్వకుండా ఉండటానికి పోరాడతారు. శక్తి ఉంటే కోర్టుకు వెళ్తారు. పొలాలకు కాలువలు తవ్వడానికి ఎవరైనా భూములు ఇస్తారా..? బలవంతంగా సేకరించాలి. ఎందుకంటే.. ప్రభుత్వాలపై నమ్మకం పెట్టుకునేది తక్కువ. దేశం ఎన్నో భూపోరాటాలు చూసింది. అన్నీ.. భూమి సేకరించవద్దనే. కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మాత్రం.. రైతులు స్వచ్చందంగా 33వేల ఎకరాలు ఇచ్చారు. ఓ మహోన్నత ప్రాజెక్ట్.. ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం తమ భూముల్లో వస్తుందంటే సంతోషపడ్డారు. అన్ని పార్టీలు అంగీకరించాయని సంబరపడ్డారు. తమ భవిష్యత్‌కు ఢోకా ఉండదనుకున్నారు. కానీ ఇప్పుడేం జరిగింది. 300 రోజుల నుంచి వారికి నరకమే మిగిలింది.
రాజధాని అమరావతిలోనే ఉంటుందని… అదే పనిగా ప్రచారం చేసిన వైసీపీ నేతలు.. అందర్నీ నమ్మించారు. అందరితో పాటు రాజధాని రైతులూ నమ్మారు. అమరావతిని అక్కడకు తీసుకు వచ్చి.. పునాదులేసిన చంద్రబాబు కన్నా… జగనే ఎక్కువ మేలు చేస్తాడని అనుకున్నారేమో కానీ అందరితో పాటు ఆయనకే ఓట్లేశారు. కానీ.. అధికారం చేతికి అందిన తర్వాత పరిస్థితి మారిపోయింది. సరిగ్గా 300 రోజుల కిందట.. మూడు రాజధానుల కాన్సెప్ట్‌ను తీసుకు వచ్చారు. విశాఖకు రాజధానిని తరలించడానికి ఏర్పాట్లు చేశారు. మామూలుగా అక్కడ ఏమీ లేకపోతే.. సమస్యే ఉండేది కాదు. కానీ అక్కడ రైతుల జీవనాధారం ఉంది. దాన్ని నాశనం చేసేసి వెళ్తామంటే వారెలా ఒప్పుకుంటారు. ఒకప్పుడు అమరావతికి మద్దతు ప్రకటించి.. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు.. కుదరదంటే ఎలా ఒప్పుకుంటారు..?
భూములిచ్చిన రైతుల్ని ఇంత దారుణంగా కించపరిచిన ఘోరం ప్రపంచంలో ఎక్కడా జరిగి ఉండదు. వారు వ్యక్తిగత లాభం చూసుకుని ఇచ్చి ఉండవచ్చు..కానీ వారు ఇచ్చింది.. ఓ మహోన్నతమైన ప్రాజెక్టు కోసం.. రాష్ట్రానికి రాష్ట్ర ప్రజల భవిష్యత్‌కు భరోసా ఇచ్చేప్రాజెక్ట్ కోసం. అంత మాత్రాని వారిని కులం, మతం అంటగట్టి తిట్టడమేనా. పెయిడ్ ఆర్టిస్టులని.. లం… కొడుకలని రాయలేనివిధంగా తిట్టడమేనా…?. ఈ మూడు వందల రోజుల్లో అమరావతి రైతులు ఎదుర్కొన్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పోలీసుల ఇనుప బూట్ల దెబ్బలు తిన్నారు. లాఠీని ఎదుర్కొన్నారు. పోలీసు దెబ్బ పడని రైతు లేడంటే ఆశ్చర్యం లేదు. ఇప్పటికీ ఆ పరిస్థితి అంతే ఉంది. ఇన్ని జరుగుతున్నా.. మంత్రులు వారిని పెయిడ్ ఆర్టిస్టులనే అంటున్నారు కానీ… వారి త్యాగాన్ని గుర్తించడం లేదు.
రాజధాని అంటే.. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి. ఒక్క భూములిచ్చినరైతులది కాదు. ఒక్క సారి రాజధానిగా ఏర్పడితే.. అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి నివసిస్తారు. కానీ.. రాజధానికి సమస్య వస్తే రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో ప్రజలు సానుభూతి చూపిస్తున్నారే కానీ.. బయటకు వచ్చి.. మన రాజధానిని కాపాడుకుందామనే ప్రయత్నం చేయడం లేదు. కేసులకు భయపడి.. ఒక్కరూ బయటకు రాలేకపోతునన్నారు. కానీ అదే అమరావతి రైతులు.. లాఠీ దెబ్బలకే సిద్ధమవుతున్నారు. ఇప్పటికి 300 రోజులుగా ఉద్యమం సాగుతోంది. ఇంకెంతకాలం చేయాలో తెలియదు. న్యాయపోరాటం చేస్తున్నారు. ఆ న్యాయవ్యవస్థ మీదనే ప్రభుత్వం దాడి చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అమరావతి రైతుల భవిష్యత్ ఆగమ్య గోచరం. నమ్మి మోసపోయిన వాళ్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో రైతుల్ని చూస్తేనే అర్థమైపోతుంది.