న్యాయవ్యవస్థపై, న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో.. మీడియా ఎదుట అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ఎనిమిది వారాల్లో విచారణ పూర్తి చేయాలని సీబీఐకి సూచించింది. సీబీఐకి సహకరించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయాలపై హైకోర్టుల్లో వ్యతిరేక తీర్పులు వస్తున్నాయన్న కారణంగా… వైసీపీకి చెందిన నేతలు..ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పెద్ద ఎత్తున న్యాయవ్యవస్థపై దాడికి దిగింది. ఆ పార్టీకి చెందిన మంత్రులు… స్పీకర్ సహా.. అనేక మంది న్యాయవ్యవస్థపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు.ఆ పార్టీ కార్యకర్తలు… న్యాయమూర్తుల్ని చంపుతాం.. నరుకుతాం అనే బెదిరింపులతో పోస్టింగ్‌లు పెట్టారు. చివరికి వాటిపై హైకోర్టు రిజిస్ట్రార్ సీఐడీకి ఫిర్యాదు చేశారు. కానీ… తాము అలాంటి పోస్టింగ్‌లు పెట్టిన వారందరికీ తాము అండగా ఉంటామని ఎంపీ విజయసాయిరెడ్డి బహిరంగంగా ప్రకటించారు.
ఆ ప్రకటన ఫలితమేమో కానీ.. సీఐడీ పోలీసులు ఇంత వరకూ ఒక్క అరెస్ట్ కూడా చేయలేదు. ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేయలేదు. దీనిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీల కార్యకర్తలు ప్రభుత్వాన్ని విమర్శిస్తే శరవేగంగా కేసులు నమోదు చేసి అర్థరాత్రిళ్లు వెళ్లి అరెస్ట్ చేస్తున్నారు. అదే న్యాయవ్యవస్థపై దారుణమైన వ్యాఖ్యలు చేస్తే మాత్రం సీఐడీ పట్టించుకోలేదు. ఇలా వ్యాఖ్యలు చేసిన వారిలో స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి సీదిరి అప్పలరాజు, ఎంపీ నందిగం సురేష్ సలహా పలువురు ప్రముఖులు ఉన్నారు. అయితే వీరందరూ ప్రత్యేకంగా వైసీపీ పార్టీ నుంచి అందిన స్క్రిప్ట్ ప్రకారమే విమర్శలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో సీబీఐ విచారణలో కీలకమైన విషయాలు బయటపడే అవకాశం ఉందని చెబుతున్నారు.
సోషల్‌మీడియాలో ఇటీవల జడ్జిలను దూషించిన వారిపై కూడా.. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశింది. గతంలో రెండు విడతలుగా 93 మందికి నోటీసులు జారీ చేశారు. ఈ సారి మరి కొంత మందికి జారీ చేసే అవకాశం ఉంది. సీబీఐ కేసు విచారణ ప్రారంభమైన తర్వాత ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఏపీ పోలీసుల తీరుపై వరుసగా హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశిస్తూ వస్తోంది. ఈ సారి సీఐడీ పోలీసులు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారన్నదానిపైనా సీబీఐ విచారణ జరిపే అవకాశాలున్నాయి.