కరోనా విషయాన్ని తెలంగాణ సర్కార్ మర్చిపోయినా.. హైకోర్టు మాత్రం వదిలి పెట్టడం లేదు. గత విచారణలో ఆదేశించినట్లుగా తెలంగాణ సర్కార్ కరోనా పరిస్థితులపై హైకోర్టుకు నివేదిక సమర్పించింది. అయితే ఆ నివేదికలో అసలు విషయాలు కన్నా.. అవసరం లేని విషయాలే ఎక్కువగా ఉండటంతో మొక్కుబడి నివేదిక సమర్పించారని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనాపై వాస్తవాలు వెల్లడించేందుకు ప్రభుత్వం ఇష్టపడటం లేదని.. మరణాలపై తప్పుడు గణాంకాలు ఇస్తున్నారని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. కరోనా కేసులు తగ్గినా, పెరిగినా.. మరణాలు పదే ఉంటున్నాయని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇతర రాష్ట్రాల్లోని కరోనా కేసులు, మరణాలతో పోలుస్తూ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
తెలంగాణలో రెండో దశ కరోనా వ్యాప్తి పొంచి ఉన్నట్లు స్పష్టమవుతోందని.. ఈ ముప్పు ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని ధర్మాసనం సూచించింది. కరోనా పరీక్షలు, పడకలు, వెంటిలేటర్లు, మొబైల్ వ్యాన్లు పెంచాలని మరోసారి ఆదేశించింది. గాంధీ, చాతీ ఆస్పత్రుల్లో లైవ్ డ్యాష్ బోర్డు ఏర్పాటు చేస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రజారోగ్య సిబ్బందిని ఇతర పథకాల అమలుకు మళ్లించవద్దని ఆదేశించింది. కరోనా పరిస్థితుల్లో గృహహింసపై ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని సూచించింది. తాము అడిగిన వివరాలపై నవంబరు 16లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించి.. తదుపరి విచారణ నవంబరు 19కి వాయిదా వేసింది.
కరోనా ప్రారంభమైనప్పటి నుండి… తెలంగాణ హైకోర్టు.. ప్రభుత్వంపై విరుచుకుపడుతూనే ఉంది. వైరస్‌ను తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రజల్ని గాలికి వదిలేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తూవస్తోంది. హైకోర్టు పలుమార్లు ఘాటు వ్యాఖ్యలు చేయడంతో .. అప్పటి వరకూ కొన్ని చర్యల విషయంలో తేలిగ్గా తీసుకున్న ప్రభుత్వం ..తర్వాత టెస్టులు పెంచడం.. వివారలు అందుబాటులో ఉంచడం వంటి కార్యక్రమాలు చేపట్టింది. అప్పటి నుంచి కరోనాపై హైకోర్టు ఫాలో అప్ చేస్తూనే ఉంది. ప్రభుత్వం తీరుపై ఎప్పటికప్పుడు ఘాటుగా సూచనలు చేస్తూనే ఉంది.