న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ వ్యవహరిస్తున్నారని తక్షణం చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయింది. సునీల్ కుమార్ సింగ్ అనే న్యాయవాది…ఈ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్‌వీ రమణతో పాటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చెందిన కొంత మంది న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ..సీజేఐకి రాసిన లేఖను మీడియా ముందు బహిర్గత పరిచి.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని పిటిషన్‌లో సునీల్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. తక్షణం న్యాయవ్యవస్థపై ఏపీ సర్కార్ , జగన్ ఎలాంటి ఆరోపణల్ని మీడియా ముఖంగా.. సోషల్ మీడియాలోనూ చేయడాన్ని నియంత్రించాలని పిటిషనర్ కోరారు. జగన్‌కు తక్షణం షోకాజ్ నోటీసులు జారీ చేసి.. ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ అడగాలని పిటిషన్ లో సునీల్ కుమార్ సింగ్ కోరారు.
ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలను మీడియా ముందు చేసి.. న్యాయవ్యవస్థపై ఉన్న గౌరవాన్ని తగ్గించేందుకు విశ్వసనీయతను దెబ్బకొట్టేందుకు కుట్రపూరితంగా జగన్ వ్యవహరించినట్లుగా… ప్రెస్‌మీట్‌తోనే తేలిపోయిందని పిటిషన్‌లో సింగ్ పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి తన పరిధిని దాటారని స్పష్టం చేశారు. హైకోర్టు,సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై వచ్చే ఆరోపణలపై ఎలా చర్చించాలో రాజ్యాంగంలో స్పష్టంగా ఉందని.. ఇలా మీడియా ముందు పెట్టడం ఖచ్చితంగా దురుద్దేశపూర్వకమని స్పష్టం చేశారు.
రాజ్యాంగంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ హక్కు పౌరులకు ఇచ్చినప్పటికి.. కొన్ని పరిమితులు ఉన్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. కోర్టుధిక్కరణ కిందకు వచ్చే అంశాలపై భావప్రకటనా స్వేచ్చ పేరుతో ఇష్టం వచ్చినట్లుగా ఆరోపణలు చేయడం సాధ్యం కాదన్నారు. ప్రస్తుతం ఎవరిపైనైనా ఆధారాలు లేని ఆరోపణలు చేసి.. వాటిని గంటల్లోనే వైరల్ చేసి.. క్యారెక్టర్లను దెబ్బతీస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. తక్షణం దీన్ని నివారించాల్సి ఉందన్నారు. రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి న్యాయవ్యవస్థను గౌరవించాల్సి ఉందని.. కానీ అలా జరగడం లేదన్నారు. దేశం ప్రస్తుతం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని జగన్మోహన్ రెడ్డిలా.. న్యాయవ్యవస్థ నమ్మకాన్ని దెబ్బతీసే పనులను సహిస్తే ప్రజల నమ్మకం వమ్ముఅవుతుందన్నారు. ఇలాంటి వాటని సహించకూడదని పిటిషనర్ కోరారు.
కొద్ది రోజుల కిందట.. సుప్రీంకోర్టు మీద వ్యాఖ్యలు చేసిన సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్‌ను కంటెంప్ట్ కేసు కింద సుప్రీంకోర్టు శిక్షించింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంత కంటే తీవ్రమైన తప్పిదానికి పాల్పడ్డారని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.