వైఎస్ఆర్ సీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ న్యాయవ్యవస్థపై తెరలేపిన యుద్ధం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. మెజారిటీ ప్రజలు జగన్ తనపై ఉన్న కేసుల విచారణ సందర్భంగా, తన వాదన బలహీనపడి పోవడంతోనే, ఈ పర్వానికి తెరలేపారని భావిస్తుండగా, వైయస్ఆర్సీపీ అభిమానులతో పాటు మరికొందరు కూడా న్యాయవ్యవస్థలో ప్రక్షాళనకు జగన్ చర్యలు ఉపకరిస్తాయని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సందర్భంలో మరికొన్ని రకాల వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి.
ప్రస్తుతం జగన్ తరఫున వైఎస్ఆర్సిపి తెరలేపిన ఆరోపణల పర్వానికి, ఆ మధ్య జగన్ స్వయంగా ప్రెస్మీట్ పెట్టి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ పై చేసిన ఆరోపణల పర్వానికి మధ్య పోలికలు ప్రస్తుతం తెర మీదకు వస్తున్నాయి. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్థాయి వ్యక్తి మీద నేరుగా ఆరోపణలు చేయడమే ఒక సంచలనం అయితే, వాటిని సామాజిక వర్గాలకు ముడిపెడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్థాయి వ్యక్తికి కులాలను ఆపాదిస్తూ జగన్ చేసిన విమర్శలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. అయితే మొదటి సారి అలాంటి ఆరోపణలు చేయడం కారణంగా జగన్ చేసిన వ్యాఖ్యల పట్ల చాలా మంది ప్రజలలో- ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అంటే బహుశా నిజమై ఉండవచ్చునేమో – అంటూ కొంత అనుకూలత కనిపించింది.
అయితే ఇప్పుడు జస్టిస్ రమణ పై వైఎస్ఆర్సిపి అనుంగు మీడియా, వైఎస్ఆర్సిపి అనుకూల సోషల్ మీడియా ఇదే తరహా ఆరోపణలు విమర్శలు చేస్తున్నాయి. దీంతో ఈ విమర్శల పట్ల రావాల్సినంత స్పందన ప్రజల నుండి రావడం లేదు. అందులోనూ వైఎస్సార్సీపీని అభిమానించే వారిలో, ప్రత్యేకించి ఆ పార్టీని అభిమానించే విశ్లేషకుల లో- నిమ్మగడ్డ రమేష్ సమయంలో ఈ వాదన వాడేసేయడం వల్ల ఇప్పుడు చేస్తున్న ఆరోపణలకు తగినంత మద్దతు ప్రజల నుండి రావడం లేదనే అభిప్రాయం కలుగుతుంది. మొదటిసారిగా ఇప్పుడే గనక జగన్ సామాజిక వర్గాలను ముడిపెట్టే ఆరోపణలు చేసి ఉంటే ఆశించినంత ఇంపాక్ట్ వచ్చి ఉండేదని వారు అభిప్రాయపడుతున్నారు.
అప్పుడు నిమ్మగడ్డ రమేష్ పై ఆరోపణలు చేయకుండా కొంత ముందుచూపుతో, సంయమనంతో వ్యవహరించి ఉంటే, “సామాజిక వర్గం తో ముడిపడిన ఆరోపణలు” అనే బ్రహ్మాస్త్రం జగన్ కి ఇప్పుడు పనికి వచ్చి ఉండేదని, నిమ్మగడ్డ రమేష్ పై తొందరపడి ఆ అస్త్రం జగన్ జారవిడుచుకున్నాడని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే రానున్న రోజుల్లో ఈ వ్యవహారం ఏ రకమైన మలుపులు తిరుగుతుందో అప్పుడు ప్రజల స్పందన ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి.