టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరంటే… ఇప్పుడంతా పూజా హెగ్డే పేరే చెబుతారు. సమంత, తమన్నా, అనుష్క, కాజల్.. ఇలా సీరియర్లందరినీ తలదన్నే ఇమేజ్ ని సొంతం చేసుకుంది. యువ హీరోలు, స్టార్ హీరోలూ.. ఇప్పుడు పూజా పేరే జపిస్తున్నారు. అందరితోనూ ఓసారి జట్టు కట్టేసి, ఇప్పుడు ఫ్రెష్ గా మరో రౌండు పూర్తి చేయబోతోంది పూజా. `అల వైకుంఠపురములో` బుట్టబొమ్మగా కనిపించి హృదయాల్ని కొల్లగొట్టి – ఇప్పుడు రాధేశ్యామ్ లో ప్రభాస్ పక్కన జోడీ కడుతోంది.
ఈరోజు.. పూజా పుట్టిన రోజు. ఈ సందర్భంగా `రాధేశ్యామ్` నుంచి పూజా స్టిల్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో పూజా.. ప్రేరణగా కనిపించబోతోందట. ట్రైన్‌లో.. బుద్ధిగా, చక్కగా, అందంగా, ఒద్దిగ్గా.. కూర్చున్న పూజా లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. 1980… ఆ ప్రాంతంలో, ఇటలీ నేపథ్యంలో సాగే సినిమా ఇది. ట్రైన్ సెటప్పులోనే.. ఆ విషయాన్ని లుక్ ద్వారానే చెప్పే ప్రయత్నం చేసింది చిత్రబృందం. ఇదో లవ్ స్టోరీ. కథానాయిక పాత్రకూ చాలా ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది. ప్రభాస్ సినిమా కాబట్టి, పాన్ ఇండియా రేంజులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాతో.. పూజా పేరు ఈసారి బాలీవుడ్ లో ఇంకా గట్టిగా వినిపించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.