దుబ్బాక ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఓటర్లు ఆ అంశాన్ని తమ సమస్యల పరిష్కారం కోసం ఉపయోగించుకుంటున్నారు. నియోజకవర్గానికి సంబంధించిన పలు డిమాండ్ల పై సిఎం కెసిఆర్, మంత్రి హరీష్ రావు హామీ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. దుబ్బాక ప్రజల మొదటి డిమాండ్ రెవిన్యూ డివిజన్. దుబ్బాకలో ఇప్పటికే దౌల్తాబాద్, రాయపోల్, తొగుట, మిరుదొడ్డి మండలాల వ్యవసాయ శాఖ ఏడిఏ కార్యాలయం ఉంది. డివిజన్ కేంద్రం ఏర్పాటు తో ఆర్డీవో కార్యాలయంతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాలు వస్తే అభివృద్ధికి అవకాశం ఉంటుందని అంటున్నారు.
దుబ్బాక పట్టణంలో ఎక్కువ మంది జీవనోపాధి చేనేత వృత్తి ద్వారా పొందుతారు. అందుకే టెక్స్ టైల్ పార్కును ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. చేనేత కార్మికులకు ఉపాధి కరువై సిరిసిల్ల, నిజామాబాద్‌తో పాటు మహారాష్ట్రలోని నాందేడ్, బీవండి, షోలాపూర్, ప్రాంతాలకు వలస వెళుతున్నారు. టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. నిజానికి దుబ్బాకలో టెక్స్ టైల్ పార్క్ పెడతామని కేసీఆర్ హామీ ఇచ్చారు. అలాగే వందపడకల ఆసుపత్రి నిర్మిస్తామని చెప్పినా పూర్తి కాలేదు.
ఈ సమస్యలన్నింటినీ ప్రజలు నేతల ముందు ఉంచుతున్నారు. అధికార పార్టీ మంత్రి హోదాలో మంత్రి హరీష్ రావు నెరవేరుస్తామని హామీ ఇస్తున్నారు. వాటితో పాటు మరింత అభివృద్ధి చేస్తానని.. దుబ్బాకను మరో సిద్దిపేటను చేస్తానని చెబతూ వస్తున్నారు. అయితే విపక్ష నేతలు మాత్రం.. మొన్నీ మధ్య ఉపఎన్నిక జరిగిన హుజూర్ నగర్లో ఏం చెప్పారు.. ఏం హామీలు అమలు చేశారో చెప్పాలని.. అంటున్నారు. ఉపఎన్నికలో టీఆర్ఎస్ లో గెలిస్తే.. ప్రశ్నించడానికి కూడా నోరు తెరవనివ్వరని హెచ్చరిస్తున్నారు. అయితే.. ప్రజలు మాత్రం ఎప్పటిలానే… గెలిపిస్తే హామీలు నెరవేరుస్తారేమోనని ఆశ పడుతున్నారు.