ఆర్.ఎక్స్ 100తో ఆకట్టుకున్న దర్శకుడు అజయ్ భూపతి. అయితే ఆ హిట్టుని వెంటనే క్యాష్ చేసుకోలేకపోయాడు. `మహా సముద్రం` అనే కథ రాసుకున్నా – దాన్ని ఓకే చేయించుకోవడానికే చాలా కాలం పట్టింది. ఎట్టకేలకు ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. హీరో, హీరోయిన్లని కూడా లాక్ చేసేసుకున్నాడు. ఈ సినిమాలో శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అతిథిరావు హైదరీకి కథానాయిక పాత్ర దక్కింది.
అయితే ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన అంశం టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకీ అజయ్ భూపతి `ఆర్.ఎక్స్ 100` ఫార్ములానే పాటిస్తున్నాడట. ఆ సినిమాకి కొత్త గ్లామర్ తెచ్చిన పాయింట్… హీరోయిన్ క్యారెక్టరైజేషన్. కథానాయికనే విలన్ ని చేయడం… ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది. `మహా సముద్రం`లోనూ ఆ టచ్ ఉండబోతోందట. కథానాయిక పాత్రలో నెగిటీవ్ షేడ్స్ కనిపించబోతున్నాయట. అయితే మరీ `ఆర్.ఎక్స్ 100` టైపులో కామ పిచాచి టైపు పాత్ర కాదు గానీ, హీరోయిన్ క్యారెక్టరైజేషన్ షాకింగ్ గా ఉండబోతోందని టాక్. `మహా` అనే పాత్ర చుట్టూ తిరిగే కథ ఇది. విశాఖ సముద్ర తీరం నేపథ్యంలో సాగుతుంది. అందుకే ఈ సినిమాని `మహా సముద్రం` అని పేరు పెట్టారు. కథానాయిక పాత్రనే టైటిల్ గా పెట్టారంటే.. కథలో కూడా తనకు కీలకమైన పాత్ర ఉన్నట్టే. మరి ఆ పాత్ర తీరు తెన్నులు ఎలా ఉంటాయో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాలి.