ఓ బేబీతో.. సమంత అదరగొట్టేసింది. ఈ సినిమాకి నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్. దానితో పాటు… ఓ బేబీ సూపర్ హిట్. అందుకే మరోసారి వీరిద్దరూ కలిసి పనిచేయడానికి రెడీ అయిపోయారు. అయితే దానికి కాస్త టైమ్ పడుతుందనుకున్నారంతా. కానీ కాలం కలిసొచ్చి – అతి త్వరలోనే ఈ కాంబో సెట్స్ పైకి వెళ్లబోతోంది.
సోనీ పిక్చర్స్ సంస్థకు ఓ సినిమా చేయడానికి అంగీకరించింది సమంత. దానికి అశ్విన్ శరవణన్ దర్శకుడు. కథంతా రెడీ అయిపోయింది. అయితే అనూహ్యంగా.. ఈసినిమా నుంచి అశ్విన్ తప్పుకున్నాడని టాక్. ఆ బాధ్యత నందిని రెడ్డి చేతిలో పెట్టార్ట. వెంటనే ఈ కాంబోని సెట్స్‌పైకి తీసుకెళ్లబోతోంది సోనీ పిక్చర్స్. అయితే ఇది ఓ హారర్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. కథ అశ్విన్‌దే. డైరెక్షన్ మాత్రం నందినిది. హారర్ సినిమాలో నటించడం సమంతకు ఇదే తొలిసారి. అలాంటి కథని డైరెక్ట్ చేయడం నందినికీ తొలిసారి. మరి ఈసారి ఈ కాంబో ఏం మ్యాజిక్ చేస్తుందో చూడాలి. నవంబరులో ఈ సినిమా మొదలు కాబోతోంది. త్వరలోనే ఓ అధికారిక ప్రకటన రాబోతోంది.