ఎట్టకేలకు చెన్నై ఓ విజయాన్ని అందుకుంది. పాయింట్ల పట్టికలో కాస్త పైకి ఎక్కింది. వరుస పరాజయాలకు బ్రేక్ వేస్తూ… సీఎస్కే అభిమానులకు కాస్త ఊరట కలిగించింది. అయితే… మంగళవారం నాటి మ్యాచ్‌లో ధోనీ స్ట్రాటజీ క్రికెట్ విశ్లేషకులకు సైతం అర్థం కాలేదు. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో ఏకంగా ఏడుగురు బౌలర్లని రంగంలోకి దింపాడు ధోనీ.
టీ 20 అంటే.. బ్యాట్స్మెన్ల రాజ్యం. ఆరుగురు బ్యాట్స్మెన్లు, నలుగురు బౌలర్లు, ఓ ఆల్ రౌండర్ తో జట్టు కూర్పు ఉండడం చూస్తుంటారు. కానీ.. బుధవారం నాటి మ్యాచ్‌లో ధోనీ కూర్పు చూసి అంతా ఆశ్చర్యపోయారు. నలుగురు బ్యాట్స్‌మెన్, ఏడుగురు బౌలర్లతో ధోనీ రంగంలోకి దిగాడు. చావ్లా, దీపక్ చాహాల్, శార్దూల్, కర్ణ్ శర్మ, జడేజా, శ్యామ్ కరన్, బ్రావో వీళ్లంతా బౌలర్లే. బ్రావోని ఆల్ రౌండర్ జాబితాలో తీసుకున్నా ఏకంగా ఆరుగురు బౌలర్లని రంగంలోకి దింపినట్టు. ఈ ఏడుగురుతోనూ ధోనీ బౌలింగ్ చేయించాడు. ఎప్పుడూ ఓపెనింగ్ కి దిగని శ్యామ్ కరణ్ ని, డూప్లెసిస్ తో ఓపెనింగ్ చేయించాడు. డూప్లెసీస్, వాట్సన్, రాయుడు, ధోనీ తప్ప పూర్తి స్థాయి బ్యాట్స్‌మెన్స్ ఎవరూ లేరు. శ్యామ్, జడేజా, బ్రావో.. వీళ్లు బ్యాటింగ్ కూడా చేయగల సమర్థులు తప్ప, బ్యాట్స్‌మెన్ కారు. అంటే.. కేవలం నలుగురు బ్యాట్స్మెన్లతో ధోనీ ఈ మ్యాచ్‌కి దిగిపోయాడన్నమాట. గెలవక తప్పని పరిస్థితుల్లో, బ్యాటింగ్ లో బలహీనంగా కనిపిస్తున్న వేళ.. ధోనీ తీసుకున్న ఈ రిస్క్ అందరినీ విస్తుపోయేలా చేసింది. ఓపెనింగ్ కి దిగిన శ్యామ్ కరన్…. వేగంగా ఆడి 31 పరుగులు చేశాడు కాబట్టి సరిపోయింది. లేదంటే… చెన్నై బ్యాటింగ్ మరోలా ఉండేది. ఈ ఏడుగురు బౌలర్లలో పూర్తి కోటా ఉపయోగించుకుంది ఇద్దరే. చాహర్, కర్ణ్ శర్మ మాత్రమే తమ 4 ఓవర్ల కోటా పూర్తి చేయగలిగారు. కేవలం బౌలర్ గా పనికొచ్చే చావ్లా చేత కేవలం ఒకే ఒక ఓవర్ వేయించాడు.
టీ 20 మ్యాచ్‌లో ఇంతమంది బౌలర్లు ఎందుకన్నది ప్రశ్న. కాకపోతే.. ధోనీ దగ్గర మరో ఆప్షన్ లేదు. నమ్మదగ్గ బ్యాట్స్‌మెన్ తన రిజర్వ్ బెంచ్‌లో కనిపించలేదు. ఈ విషయాన్ని ధోనీ సైతం ఒప్పుకుంటున్నాడు. తమ దగ్గర బ్యాట్స్‌మెన్స్ లేరని, అందుకే ఆల్ రౌండర్లపై ఆధారపడాల్సివస్తుందని, బౌలర్లు ఎక్కువమంది ఉండడం వల్ల, ప్రత్యామ్నాయం కనిపిస్తోందని, ఒకరు సరిగా బౌలింగ్ చేయకపోయినా, ఆ స్థానాన్ని మరొకరితో భర్తీ చేసుకోవడం సులభం అవుతుందని చెబుతున్నాడు. కాకపోతే ఈ ఫార్ములా అన్నిసార్లూ చెల్లదు. భారీ స్కోర్ ఛేజ్ చేయాల్సివచ్చినప్పుడు పూర్తిస్థాయి బ్యాట్స్ మెన్ లేకపోతే… పరుగులు రాబట్టడం మరింత కష్టం అవుతుంది. తరువాతి మ్యాచ్‌లలో ధోనీ ఏం చేస్తాడో చూడాలి.