ఐదేళ్ల కిందట ముంబైలో వరదలు వచ్చి అంబానీలు, అమితాబ్‌లు కూడా కరెంట్ లేక.. నిత్యావసరాలు అందక కిటకిటలాడిన పరిస్థితి చూసి.. దేశం మొత్తం ఆశ్చర్యపోయింది. ప్రకృతి ఆగ్రహిస్తే మహానగరం ఇంతలా వణికిపోతుందా అని భయడింది. ఆ తర్వాత చెన్నైది అదే పరిస్థితి. చెన్నైలో వచ్చిన వరదల దెబ్బకు..అక్కడి ప్రజలు దిక్కు లేని వారయ్యారు. కోలుకోవడానికి వారం పది రోజులు పట్టింది. లక్షల సంఖ్యలో వ్యక్తిగత వాహనాలు పనికి రాకుండా పోయాయంటే.. అవి నీటిలో ఎన్ని రోజులు నానిపోయాయో అర్థం చేసుకోవచ్చు. అయితే.. అలాంటి పరిస్థి హైదరాబాద్‌కు రానే రాదని.. అవి సముద్రం ఒడ్డున ఉన్నాయని.. కానీ హైదరాబాద్ మాత్రం సేఫ్ జోన్ అని అందరూ అనుకున్నారు. ఆ అనుకోవడం నిన్నటి వరకే.. ఇప్పుడు… ఆ అనుమానం తీరిపోయింది. ముంబై, చెన్నైలకు ఏ మాత్రం తీసిపోని జల విలయం… హైదరాబాద్ చవి చూసింది.
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి హైదరాబాద్ చెరువైపోయింది. ఏ రోడ్డూ ఉపయోగంలో లేదు. ఎక్కడివక్కడ బ్లాక్ అయిపోయింది. లోతట్టు కాలనీలుల్లో మొదటి అంతస్తు మొత్తం నీరే. రెండో అంతస్తులో మాత్రమే జనం ఉండటానికి ఉపయోగపడ్డాయి. ఇక కొత్తగా నిర్మించిన కాలనీలు.. సెల్లార్లు ఉన్న అపార్టుమెంట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అవి నీటిలో నానిపోతూ ఉన్నాయి. నాలుగేళ్ల కిందట.. కూకట్ పల్లి దగ్గర భండారి లే అవుట్లో అపార్టుమెంట్ సెల్లారే కాదు.. రెండో ఫ్లోర్‌లోకి నీరు రావడం చూసి నాలాల ఆక్రమించుకోవడం వల్లనే ఆ పరిస్థితి అని చెప్పుకున్నారు.. ఇప్పుడు అత్యంత ఎత్తైన ప్రాంతాలుగా చెప్పుకున్న చోట్ల కూడా.. అపార్టుమెంట్లు సెల్లార్లు నిండిపోయాయి.
ఎటు చూసినా వాన వల్ల వచ్చిన వరద సృష్టించిన విధ్వంసమే ఇప్పుడు హైదరాబాద్‌లో కనిపిస్తోంది. ఎవరూ.. ఒక చోట నుంచి మరో చోటకు పోవడానికికూడా దారి లేకుండా పోయింది. కజీహెచ్ఎంసీ సిబ్బంది ఎంత ప్రయత్నించినా… ఎంత అని కవర్ చేయగలుగుతారు..? ఏ మూల చూసినా విరిగిపడిన చెట్లు.. విద్యుత్ స్తంభాలు. సెల్లార్లు ఉన్న వ్యాపార సంస్థల్లో నీరు తప్ప ఇంకేమీ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే.. హైదరాబాద్ మునిగిపోయింది.. తేరుకున్న తర్వాతే జరిగిన నష్టమేంటో తెలుస్తుంది.
భాగ్యనగరం చాలా గొప్పది. ఎలాంటి ఆటుపోట్లనైనా తట్టుకుంటుంది. అలాగే వరదనీ తట్టుకుంటుంది. రేపు కోలుకుంటుంది. కానీ… ఈ పరిస్థితి ఎందుకు కొచ్చింది..? ఎక్కడ తప్పు జరిగింది..? వరద నీరు ఎందుకు రోడ్లను ముంచెత్తింది..? అవి పోయే మార్గాలు ఎందుకు మూసుకుపోయాయయని అన్వేషిస్తే.. మొత్తానికి పరిష్కారం లభిస్తుంది. ఎంత వరద పడినా… ఆ నీరు పోయే మార్గం సేఫ్‌గా ఉంచితే.. వరదల నుంచి రక్షణ లభిస్తుంది. లేకపోతే.. ఇదే పరిస్థితి ఎప్పటికీ ఏర్పడుతుంది.