ఈటీవీకే తలమానికమైన కార్యక్రమం `పాడుతా తీయగా`. ఎన్నో ఏళ్లుగా ఈటీవీ రేటింగుల్ని మోస్తున్న సంగీత ధారావాహిక ఇది. ఎంతోమంది వర్థమాన గాయనీ గాయకుల్ని ప్రపంచానికి పరిచయం చేసింది. పాడుతా తీయగా ద్వారానే గాయకులుగా మారినవాళ్లెందరో..? సంగీతాభిమానుల మనసుల్లో ఈ కార్యక్రమానికి విశిష్ట స్థానం ఉంది. ఈ కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియ అన్నీ ఎస్పి బాలూనే. ఇప్పుడాయన లేరు. పాడుతా తీయగా తాజా సిరీస్ ని కూడా ఆయన పూర్తి చేసేశారు. ఆ కార్యక్రమం ముగిశాకే… బాలు అనారోగ్యం పాలయ్యారు. ఆ తరవాత కన్ను మూశారు.
బాలూ మరణం.. సంగీతాభిమానులకు తీరని లోటు. ఈటీవీకి కూడా. ఆయన లేని `పాడుతా తీయగా`ని ఊహించలేం. ఈ కార్యక్రమంలో పాడే పాటలు, వినిపిస్తున్న కొత్త గళాల మాట అటుంచితే.. తెలుగు భాష గురించీ, ఆ పాటలతో తనకున్న అనుబంధాన్ని గురించి, ఆ పాట పుట్టు పూర్వొత్తరాల గురించి, కవి గురించి, దాని వెనుక కథ గురించీ బాలు పూస గుచ్చినట్టు విశ్లేషించేవారు. ఆ మాటలు వినడానికైనా సరే – ఈటీవీ ట్యూన్చేసేవారు. ఇప్పుడు బాలూ లేరు. మరి `పాడుతా తీయగా` ఉంటుందా, ఉండదా?
బాలుకి ప్రత్యామ్నాయం లేదు. ఆయన స్థానంలో మరొకర్ని కూర్చోబెట్టడం చాలా కష్టం. అయినా సరే.. ఈటీవీ యాజమాన్యం ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించినట్టు భోగట్టా. జేసుదాస్, మనో, చిత్ర, జానకి.. ఇలాంటి వాళ్లందరి పేర్లూ.. పరిశీలించి ఓ లిస్టుని రామోజీరావు ముందు పెట్టారని తెలుస్తోంది. కానీ రామోజీ మాత్రం ఆ లిస్టుని పక్కన పెట్టారని తెలుస్తోంది. బాలు లేకుండా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లడంలో అర్థం లేదన్నది రామోజీ మాట. బాలుకి ప్రత్యామ్నాయం చూపించలేమని, బాలుతోనే ఈ కార్యక్రమం మొదలైందని, ఆయనతోనే ఆగిపోవాలని రామోజీ చెప్పినట్టు తెలుస్తోంది.
నిజానికి బాలు ముందు `పాడుతా తీయగా` ప్రతిపాదన తెచ్చినప్పుడు ఆయన ఒప్పుకోలేదు. `ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం నా వల్ల కాదు` అని ఆయన చేతులెత్తేశారు. కానీ రామోజీ రావు బలవంతం మీద, ఆయన మాట కాదనలేక బాలు ఈ బాధ్యతని భుజాలనెత్తుకోవాల్సివచ్చింది. బాలు వల్ల `పాడుతా తీయగా` కి, ఈటీవీకి ఎంతో మైలేజీ వచ్చింది. ఈ కార్యక్రమం వల్ల బాలూకీ అంతే వచ్చింది. `నేనెక్కడికి వెళ్లినా పాడుతా తీయగా బాలూ అనే పిలుస్తున్నారు` అని బాలు కూడా చాలా సందర్భాల్లో చెప్పుకున్నారు. కొత్త గాయకులు వచ్చి, బాలుని ఎవరూ పట్టించుకోని రోజుల్లో… `పాడుతా తీయగా` ఆయనకు మంచి వ్యాపకం అయిపోయింది. ఈ కార్యక్రమంతో బాలు రామోజీరావు మధ్య స్నేహబంధం మరింత ధృడంగా మారింది. `నా ఆత్మీయ తమ్ముడు` అని రామోజీ బాలు గురించి చెప్పుకున్నారంటే.. అంతకంటే నిదర్శనం ఏముంది?
అందుకే బాలుతో మొదలైన ఈ కార్యక్రమం బాలుతో ఆగిపోవాలని రామోజీ భావిస్తున్నార్ట. ఒకవేళ ఇలాంటి కార్యక్రమమే ఈటీవీ చేపట్టదలిస్తే… వ్యాఖ్యాతతో పాటు, పేరు కూడా మార్చాలని ఈటీవీ భావిస్తోంది. మొత్తానికి బుల్లి తెర చరిత్రలో `పాడుతా తీయగా` అనే ఓ అపూర్వమైన అంకానికి తెరపడినట్టైంది.