తిరుపతిలో ఓ పాస్టర్ యువతిపై అత్యాచారం చేసిన ఘటనపై ఇంత వరకూ అరెస్టులు లేకపోవడంపై సీబీఐ మాజీ డైరక్టర్ మన్నెం నాగేశ్వరరావు నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వరకూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఐపీఎస్‌గా రిటైరైన తర్వాత మన్నెం నాగేశ్వరరావు హిందూత్వ అంశాలపై ఎక్కువగా తన అభిప్రాయాలను సోషల్ మీడియాలో వెల్లడిస్తున్నారు. ఏపీలో మత మార్పిళ్లు జరుగుతున్నాయని .. పరిస్థితి మారాలని ప్రకటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో తన దృష్టికి వచ్చిన అంశాలన్నింటిపై స్పందిస్తున్నారు. తాజాగా తిరుపతిలో పాస్టర్ అత్యాచార ఘటనలో ఎలాంటి అరెస్టులు లేకపోవడంపై ఆయన ఆశ్చర్యపోయారు.
క్రిస్టియన్ మత ప్రబోధకుడు అయినందుకే ఆయనను అరెస్ట్ చేయలేదనే అనుమానంతో.. నేరుగా ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. ఆ లేఖను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అయితే ఆయనకు తిరుపతి పోలీసులు వ్యంగ్యంగా రిప్లై ఇచ్చారు. మీ ఫిర్యాదును తదుపరి చర్యలకు పంపుతున్నామని కామెంట్ పెట్టారు. నిజానికి హిందూ యువతిపై అత్యాచారం చేసిన పాస్టర్‌ను వెంటనే అరెస్ట్ చేయాలనే డిమాండ్‌తో ఇప్పటికే హిందూసంఘాలు ఆందోళనలు కూడా చేస్తున్నాయి. హిందూ వ్యతిరేక ప్రభుత్వం ఒక వర్గానికి కొమ్ము కాస్తోందని .. అత్యాచారానికి పాల్పడిన పాస్టర్‌పై దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొదట కేసు పెట్టడానికి తటపటాయించిన పోలీసులు విషయం పెద్దది కావడంతోగాజులమండ్యం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. అయితే ఎలాంటి అరెస్టులు చేయలేదు. పోలీసులు వ్యవహరించిన తీరుపై బాధితురాలి బంధువులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఈ అంశంపై స్పందించారు. తిరుపతిలో యువతిపై మత ప్రచారకుడు లైంగిక దాడికి పాల్పడ్డ ఘటనపై.. కేసు నమోదు చేయకపోతే ‘స్పందన’లో బాధితురాలు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని దిశ చట్టం చేశామని ప్రచారం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఏం సాధించిందని ప్రశ్నించారు. అత్యాచార ఘటనలపై కేసు నమోదు విషయంలోనూ.. పోలీసు శాఖ స్పందన సక్రమంగా లేదని ..ఆడ బిడ్డలకు రక్షణ ఇవ్వని చట్టాలు చేసి ప్రయోజనం ఏమిటని పవన్ మండిపడ్డారు. ఏపీలో చట్టాలు…రాజకీయ పార్టీలకు వేర్వేరుగా వర్తిస్తున్నట్లుగా … మతాలకు కూడా వేర్వేరుగా వర్తిస్తున్నాయేమోనన్న అభిప్రాయాలు.. తిరుపతి ఘటన తర్వాత వ్యక్తమవుతున్నాయి.