నాగశౌర్య బండి జోరుమీద ఉంది. వరుసగా సినిమాల్ని ఒప్పుకుంటున్నాడు. దాంతో పాటు.. తన బ్యానర్ ఐరా లోనూ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ఓ డాన్స్ మాస్టర్ చెప్పిన కథకు నాగశౌర్య ఓకే చెప్పాడు. ఈ టీవీ `ఢీ` సిరీస్ ద్వారా చాలామంది డాన్స్ మాస్టర్లు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అందులో సన్నీ ఒకడు. ఆడియో ఫంక్షన్లలోనూ, ఈవెంట్లలోనూ సన్నీ డాన్స్ షోలు చేస్తుంటాడు. కొన్ని సినిమాలకు కొరియోగ్రఫీ కూడా అందించాడు. ఇప్పుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
సన్నీ చెప్పిన కథ నాగశౌర్యకి బాగా నచ్చడంతో… ఐరా సంస్థ ద్వారా అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇందులో హీరో మాత్రం నాగశౌర్య కాదు. ముగ్గురు కొత్త కుర్రాళ్లు ఈసినిమాలో హీరోలుగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇదో హారర్, క్రైమ్,కామెడీ అని తెలుస్తోంది. ఈ దసరాకి లాంఛనంగా ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు ఒకట్రెండు రోజుల్లో తెలుస్తాయి. మరోవైపు నాగశౌర్య , `అలా – ఎలా` దర్శకుడు అనీష్ కృష్ణ కాంబోలో ఓ సినిమా ఓకే అయ్యింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఈరోజు వచ్చేసింది. ఈ చిత్రాన్నీ దసరాకే లాంఛనంగా ప్రారంభించనున్నారు.