చీఫ్ సెక్రటరీగా రెండు సార్లు మూడేసి నెలలు పొడిగింపు పొందిన నీలం సహాని పదవీ విరమణకు దగ్గర పడుతోంది. ఈ సమయంలో చీఫ్ సెక్రటరీ పోస్ట్ సీనియర్ ఐఏఎస్ అధికారుల్లో చర్చనీయాంశమయింది. సాధారణంగా సీసీఎల్ఏగా ఉండే అధికారిని సీఎస్‌గా నియమిస్తూంటారు. సీఎస్‌గా నియమించే అవకాశం ఉన్న వారినే సీసీఎల్‌గా నియమిస్తూంటారు. ఈక్రమంలో మూడు రోజుల కిందట.. సీసీఎల్ఏ అదనపు బాధ్యతలు చూస్తున్న నీరబ్ కుమార్‌ను హఠాత్తుగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఇతర బాధ్యతలు కూడా తొలగించి సాధారణ పరిపాలనా శాఖకు రిపోర్ట్ చేయమని ఆదేశించింది. సీసీఎల్ఎగా ఆదిత్యనాథ్ దాస్‌ను నియమించింది. దాంతో ఆదిత్యనాథ్ దాస్‌కు సీఎస్‌గా లైన్ క్లియర్ అయిందని అధికారవర్గాలు అనుకున్నాయి.
అయితే మూడు రోజులు గడిచిందో లేదో హఠాత్తుగా ఆదిత్యనాథ్ దాస్ ను.. మళ్లీ సీసీఎల్ఏ బాధ్యతల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ చేసి మూడు రోజులు గడవక ముందే మళ్లీ నీరబ్ కుమార్ ప్రసాద్ ను అదే బాధ్యతల్లో పూర్తి స్థాయిలో నియమించారు. మూడు రోజుల కిందట.. పోస్టింగ్ కూడా ఇవ్వకుండా ఎందుకు బదిలీ చేశారో.. మూడు రోజుల తర్వాత మళ్లీ అవే బాధ్యతలు పూర్తి స్థాయిలో ఎందుకు ఇచ్చారో అర్థం కాక అధికారవర్గాలు తలలు పట్టుకుంటున్నాయి. చీఫ్ సెక్రటరీ ఎంపిక విషయంలో ప్రభుత్వం గందరగోళంగా ఉందన్న అభిప్రాయం మాత్రం ఉన్నతాధికారవర్గాల్లో ఏర్పడుతోంది.
ప్రతీ ఐఏఎస్ అధికారి .. తన కెరీర్లో చీఫ్ సెక్రటరీగా రిటైరవ్వాలనుకుంటారు. అయితే అందరికీ ఆ అవకాశం దక్కదు. ప్రభుత్వ పెద్దల విశ్వాసం ఉండాలి. దాన్ని పొందేందుకు ప్రస్తుతం సీనియర్ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. ఈ విశ్వాస ప్రదర్శనలో ఎవరేమిటో తేల్చుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వం పడిపోయిందని అందుకే.. అటూ ఇటూ ఉత్తర్వులు మార్చేస్తున్నారని అంటున్నారు. సీసీఎల్ఏగా పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకుంటున్న నీరబ్ కుమార్ సీఎస్ అవుతారా లేక.., ప్రభుత్వం.. అంతే హఠాత్తుగా మెరుపుతీగలాంటి నిర్ణయంతో షాక్‌కు గురి చేస్తుందా అన్నది చివరి వరకూ క్లారిటీ రాకపోవచ్చు.