ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ తన సొంత మీడియాను ప్రమోట్ చేసుకునే విషయంలో ఏ మాత్రం మొహమాటానికి పోవడం లేదు. ప్రభుత్వం రాగానే సాక్షి ఉద్యోగుల్ని ప్రభుత్వంలోకి తీసుకుని వందల మందికి.. లక్షల్లో జీతాలిస్తున్న ప్రభుత్వం తర్వాత ప్రకటన రూపంలో కోట్లకు కోట్లు ఆ పత్రికకు మళ్లిస్తోంది. ప్రకటన రూపంలో వెచ్చించే ప్రజాధనంలో యాభై నుంచి అరవై శాతం తన పత్రికకే మళ్లించుకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా పేపర్ సర్క్యూలేషన్ పెంచుకోవడానికి కూడా ప్రజాధనాన్నే నిస్సంకోచంగా ఉపయోగించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వార్డు,గ్రామ సచివాలయాలను జగన్ సర్కార్ వచ్చిన తర్వాత ఏర్పాటు చేశారు. అక్కడ రెండు దినపత్రికలను అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు.
ఎవరైనా రెండు దినపత్రికలు అంటే రెండు వేర్వేరు పత్రికలనుకుంటారు. కానీ జగన్ సర్కార్ పెద్దలు వినూత్నంగా ఆలోచించారు. రెండు పత్రికలంటే.. రెండు పత్రికలు.. రెండూ ఒకటే.. అదీ సాక్షి. అంటే.. సాక్షినే రెండు కాపీలను ఒక్కో గ్రామ, వార్డు సచివాలయంతో కొనిపిస్తున్నారన్నమాట. కొనిపించడమే కాదు..ఏకంగా ఏడాది పాటు అడ్వాన్స్ కూడా వసూలు చేస్తున్నారు. ఈ మేరకు ఆయా జిల్లాల్లో అధికారులు ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు.
ప్రకటనల పేరుతో ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున సొంత ఖాతాలకు మళ్లించుకోవడం.. సాక్షి సిబ్బందిని ఎడాపెడా… ఉద్యోగాల్లోకి తీసుకుని రూ .లక్షలకు లక్షలు జీతాలివ్వడమే కాదు..ఇప్పుడు పత్రికను కూడా ప్రజాధనంతో కొనిపించే చర్యలకు ప్రభుత్వ పెద్దలు వెనుకాడటం లేదు. ఏ మాత్రం జంకూ గొంకూ లేకుండా.. కనీసం నైతికంగా కూడా కరెక్ట్ కాదన్న ఆలోచన లేకుండా.. ప్రభుత్వ పెద్దలు ఇలా ప్రజాధనాన్ని సొంత సంస్థలకు మళ్లించుకోవడం ఏమిటన్న విమర్శలు వస్తున్నాయి. భవిష్యత్లో ఇదో పెద్ద స్కాంగా మారినా ఆశ్చర్యం లేదని విపక్ష నేతలు అంటున్నారు.