`800` సినిమా మొదలవ్వక ముందే… అనేక వివాదాల్లో, విమర్శల్లో చిక్కుకుంది. ప్రపంచ ప్రఖ్యాత క్రికెట్ ఆటగాడు ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ఇది. ఆ పాత్రలో విజయ్‌సేతుపతి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. అందులో విజయ్ సేతుపతి లుక్ చూసి, ఫ్యాన్సంతా ఫిదా అయిపోయారు.
అయితే తమిళ సంఘాలు మాత్రం విజయ్‌సేతుపతిపై యుద్ధం ప్రకటించాయి. మురళీ ధరన్ తమిళ జాతి వ్యతిరేకి అని, శ్రీలంకలో తమిళుల ఊచకోతని సమర్థించాడని, అలాంటి నమ్మకద్రోహి బయోపిక్ లో ఎందుకు నటిస్తావ్? అంటూ… దుయ్యబట్టాయి. ప్రముఖ దర్శకులు భారతీ రాజా లాంటి దర్శకులు కూడా ఈ సినిమాలో నటించొద్దని విజయ్‌కి హితవు పలికారు. `షేమ్ ఆన్ విజయ్ సేతుపతి` అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడిచింది. దాంతో.. ఇప్పుడు విజయ్‌సేతుపతి దిగిరాక తప్పలేదు. ఈ సినిమా నుంచి విజయ్ తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. తమిళ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఏ పనీ చేయనని ట్విట్టర్ వేదికగా విజయ్ సేతుపతి ప్రకటించాడు. ఆఖరికి ముత్తయ్య మురళీధరన్కూడా `నాపై బయోపిక్‌లో నువ్వు నటించి విమర్శల పాలు కావొద్దు` అని విజయ్ సేతుపతిని విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి.. విజయ్ ఈ బయోపిక్ నుంచి తప్పుకోవడంతో విమర్శలకు అడ్డుకట్ట వేసినట్టైంది. అయితే. ఈ బయోపిక్ ఆపేస్తారా? లేదంటే మరో నటుడితో పట్టాలెక్కిస్తారా? అనేది చూడాలి. ఇంత జరిగాక ఏ తమిళ హీరో ఈ సినిమా చేయడానికి ముందుకు రాడు. మరో రాష్ట్రం నుంచి నటుడ్ని ఎంచుకోవాల్సిందే.