బల్దియా ఎన్నికలు ముందు వరదలు తెచ్చి పెట్టిన కష్టాన్ని ఎదుర్కొనేందుకు కేటీఆర్ రంగంలోకి దిగారు. నిలువెత్తు నీళ్లలో దిగి ఆయన కాలనీల్లో పర్యటిస్తున్నారు. బాధితులకు భరోసా ఇస్తున్నారు. ఆర్థిక సాయం అందిస్తున్నారు. జరిగిన నష్టానికి ప్రభుత్వం తరపున అందిస్తున్న సాయం.. తక్కువే అనే అభిప్రాయం ఏర్పడకుండా.. ప్రభుత్వం తరపున ఇంకా సాయం అందిస్తామని భరోసా ఇస్తున్నారు. నవంబర్‌లో గ్రేటర్ ఎన్నికలు పెట్టి వందకుపై కార్పొరేటర్ సీట్లను గెలిచేసి.. సత్తా చాటాలని కేటీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారు. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఆయనకు పట్టాభిషేకం కూడా ఉండే అవకాశం ఉంటుంది.
అయితే అనూహ్యంగా వరదలు రావడం.. దాని వల్ల సగానికిపైగా జనం నష్టపోవడంతో.. వారిలో అసంతృప్తి ప్రారంభమయింది. ప్రభుత్వం కనీస జాగ్రత్తలు తీసుకోలేదని.. నష్టపోయిన వారిని ఆదుకోలేదనే అసంతృప్తి ఇప్పుడు అంతకంతకూ పెరిగిపోయింది. ఈ విషయంలో కేటీఆర్.. ప్రజల అసంతృప్తిని చల్లార్చేందుకు తన వంతు ప్రయత్నాన్ని సీరియస్‌గా ప్రారంభించారు. హైదరాబాద్ చరిత్రలో ఇది రెండో అతిపెద్ద వర్షమని.. 1908లో ఒకే రోజు 43 సెంటీమీటర్ల వర్షం పడిందని… ఉన్నంతలో బెటర్‌గా పని చేశామని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగని.. ఆయన ప్రజల్ని అలా వదిలేస్తున్నామని చెప్పడం లేదు. ఆదుకుంటున్నామన్నారు.
ప్రజాప్రతినిధులపై బాధితుల దాడుల వ్యవహారం కూడా కేటీఆర్‌ను కలవర పరుస్తోంది. ఇలా జరిగితే.. ఎవరూ ప్రజల్లోకి వెళ్లరు. అది ఇంకా ఎక్కువ ఇబ్బందికరం అవుతుందన్న ఉద్దేశంతో తానే స్వయంగా రంగంలోకి దిగారు. కాలనీల్లో పర్యటిస్తున్నారు. వచ్చే పది రోజుల పాటు అందరూ… ప్రజలతోనే ఉండాలని ప్రజాప్రతినిధులను ఆదేశించారు. దీంతో ప్రజాప్రతినిధులు కళ్ల ముందు ఉన్నట్లుగా ఉంటుందనిప ప్రజల అసంతృప్తి తగ్గుతుందని అంచనాకు వచ్చారు. పరిస్థితి ఫీల్ గుడ్‌గా ఉందని.. భావిస్తున్న తరుణంలో కేటీఆర్‌కు వర్షాకాలం ఎండింగ్లో వచ్చిన రికార్డు వానలు… బ్యాడ్‌గా పరిస్థితిని మార్చేశాయన్న నిట్టూర్పు టీఆర్ఎస్లో వినిపిస్తోంది. అయితే దీన్ని సానుకూలంగా మార్చుకోగల సమర్ధుడు కేటీఆర్ అని అంటున్నారు.