“ఈ పబ్లిసిటీ చూస్తూంటే శవాల మీద పేలాలు ఏరుకున్నట్లుగా ఉంది..” అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. చంద్రబాబును విమర్శించేవారు. తీరా ఆయనకు అధికారంలోకి వచ్చాక.. డెత్ సర్టిఫికెట్ల మీద కూడా జగన్మోహన్ రెడ్డి నవ్వుతూ ఉండే ఫోటో వచ్చి చేరింది. ఇక పథకాల గురించి చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు మరింత కొత్తగా ఆలోచిస్తున్నారు. బర్త్, డెత్ సర్టిఫికెట్ల దగ్గర నుంచి స్కూల్ బ్యాగుల వరకూ ప్రతీ చోటా కనిపిస్తున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఎవరూ అంచనా వేయలేని.. ఊహించడానికి కూడా కష్టంగా ఉండే చోట్ల కూడా కనిపించబోతోంది.
భూముల్లో పాతనున్న సరిహద్దు రాళ్లపైనా జగన్ బొమ్మను చెక్కబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర భూసర్వే చేపట్టాలని నిర్ణయించింది. ఈ సర్వే చేసినప్పుడు… భూముల హద్దు రాళ్లు పాతుతారు. ఆ హద్దు రాళ్లకు ప్రత్యేకమైన డిజైన్ సిద్ధం చేశారు. రాయికి ఓ వైపు ఏపీ ప్రభుత్వ బొమ్మ.. మరో వైపు సీఎం జగన్ బొమ్మను చెక్కారు. వీటిని శాంపిల్‌గా మీడియాకు లీక్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు.. భూసర్వే ఎలా చేయాలో అధికారులు ఓ క్లారిటీకి వచ్చారు. ఈ అంశంపై సీఎం జగన్ రివ్యూ చేయబోతున్నారు.
ఆ రివ్యూలో జగన్ బొమ్మ ఉన్న హద్దు రాళ్లను ప్రదర్శించి సీఎం అనుమతి మేరకు.. వాటిని పొలాల్లో పాతడానికి తీసుకెళ్తారు. ఈ రాళ్లను చూసి సీఎం జగన్ వ్యతిరేకిస్తారేమో అని కొంత మంది అనుకుంటారు కానీ.. ఆయన మెచ్చుకుంటారన్న ఉద్దేశంతోనే అధికారులు ఇలా రెడీ చేశారని.. వారి కృషి వృధాపోదని.. ఇప్పటి వరకూ జరుగుతున్న ప్రచార పరంపరను చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఆయనకు తెలియకుండా.. ఆయన సలహాదారుల సూచనలు లేకుండా.. ఇలాంటివి జరిగే అవకాశమే లేదు. అంటే.. ప్రతి వ్యక్తి పొలంలోనూ… ఇక జగన్మోహన్ రెడ్డి కనిపిస్తారన్నమాట.