కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రలో సీబీఐని వినియోగిస్తున్న తీరు అక్కడి ప్రభుత్వాన్ని చికాకు పరుస్తోంది.సంబంధం లేకపోయినా.. ఇతర రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు.. సిఫార్సులు తెప్పించుకుని.. మహారాష్ట్ర కేసులపై సీబీఐ విచారణకు ఆదేశిస్తోంది. మొన్నటి సుషాంత్ సింగ్ ఆత్మహత్య కేసులోనూ.. ఇప్పుడు టీఆర్పీ రేటింగ్ కేసు వ్యవహారంలోనూ అదే పని చేయడంతో… మహారాష్ట్ర సర్కార్… సీబీఐకి జనరల్ కన్సెంట్ను రద్దు చేసింది. మహారాష్ట్రకు సంబంధించి సీబీఐ ఏ కేసు దర్యాప్తు చేయాలన్నా తమ అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. గత ఎన్నికలకు ముందు ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా సీబీఐకి జనరల్ కన్సెంట్ను రద్దు చేశారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అధికారం చేపట్టిన జగన్మోహన్ రెడ్డి.. మళ్లీ పునరుద్ధరించారు.
బీజేపీ సీబీఐని రాజకీయంగా వాడుకుంటోందని.. ఆరోపిస్తున్న బీజేపీయేతర పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో కూడాఈ జనరల్ కన్సెంట్ను రద్దు చేస్తున్నాయి. బెంగాల్ కూడా ఎప్పుడో ఈ నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో శివసేన-కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. సుషాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ముంబై పోలీసులు విచారణ జరుపుతున్న సమయంలో.. సీబీఐ దర్యాప్తు కావాలంటూ బీహార్ సర్కార్ సిఫార్సు చేసింది. దానిపై కేంద్రం విచారణకు ఆదేశించింది. తమ రాష్ట్రంలో జరిగిన దానికి బీహార్ సిఫార్సు చేయడం.. దానికి కేంద్రం వంత పాడటం ఏమిటని అప్పుడే మహారాష్ట్ర సర్కార్ అసంతృప్తి వ్యక్తం చేసింది. అదే సమయంలో తమ ప్రభుత్వంపై కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇప్పుడు.. రిపబ్లిక్ టీవీ టీఆర్పీ రేటింగ్ స్కాంకు పాల్పడినట్లుగా మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసు దర్యాప్తు సాగుతూండగానే.. ఉత్తరప్రదేశ్ నుంచి ఫిర్యాదు వచ్చిందంటూ.. సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని ప్రచారం జరుగుతోంది. ఈ సమయంలో.. ఆర్నాబ్ను కాపాడేందుకు కేంద్రం ఇలా చేస్తోందని నమ్ముతున్న మహారాష్ట్ర సర్కార్ సీబీఐకి ఇచ్చిన జనరల్ కన్సెంట్ను రద్దు చేసింది. దేశంలో పాలకులు.. చట్టాలను.. దర్యాప్తు సంస్థలను తమకు అనుకూలంగా మార్చుకుంటూండటంతో ఎవరికీ న్యాయం దక్కే పరిస్థితి లేకుండా పోయింది.