ఓటర్లు రాజకీయ పార్టీలకు ఓ మాదిరిగా కూడా కనిపించరని చెప్పడానికి ఉదాహరణగా బీహార్ ఎన్నికలు నిలుస్తన్నాయి. భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామని హామీ ఇచ్చింది. కరోనాపై ప్రజల్లో ఉన్న భయాన్ని… దాని నుంచి కాపాడతామే భరోసా ఇచ్చి ఓట్లు దండుకునే ప్రయత్నం బీజేపీ చేసింది. నిజానికి ఇప్పటికీ… కరోనాకు వ్యాక్సిన్ రాలేదు. వ్యాక్సిన్ ప్రక్రియ సాగుతోంది. వ్యాక్సిన్‌ను ప్రపంచంలోనే మొదటి సారి రిజిస్టర్ చేసుకున్న రష్యా కూడా ఇంత వరకూ ప్రజల కోసం అందుబాటులోకి తీసుకు రాలేకపోయింది.
వ్యాక్సిన్ రావాలంటే ఇంకా… చాలా కాలం పడుతుందని శాస్త్రవేత్తలు నిర్మోహమాటంగా చెబుతున్నారు. వారు చేస్తున్న ప్రయోగాలు.. ఇంత వరకూ పూర్తి స్థాయిలో సఫలం కాలేదు.. కానీ రాజకీయ పార్టీలు మాత్రం ఓట్ల వేటకు దాన్ని వాడేసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ పంపిణీకి రంగం సిద్ధం చేస్తోందని జాతీయ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మొదట కరోనా వారియర్స్‌కు వ్యాక్సిన్ ఇస్తారని చెబుతున్నారు. అసలు వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందో అంచనా వేయడం సాధ్యం కాదని నిపుణులు ఇప్పటికీ చెబుతున్నారు. ఈ లోపే రాజకీయ పార్టీల నేతలు మాత్రం.. అదే పనిగా వ్యాక్సిన్ ఆశ చూపించడం ప్రారంభించారు. మళ్లీ దానిపైన చర్చ.
ఆరోగ్య రంగం రాష్ట్రాల పరిధిలోనిదని.. వ్యాక్సిన్ ఇస్తామనే హామీ ఎలా ఇస్తారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించడం ప్రారంభించారు. ఈ ప్రశ్నలను ఆసరాగా చేసుకుని బీజేపీ మరింతగా చర్చ పెడుతోంది. ఈ క్రమంలో వ్యాక్సిన్ అసలు ఉందా లేదా … అన్న విషయం మాత్రం పక్కకుపోయింది. గెలిస్తే ఇచ్చేస్తారన్నట్లుగా ఎవరికి వారు చెప్పుకుంటున్నారు.