వరద నష్టంపై జరుగుతున్న రాజకీయం తెలంగాణకు మేలే చేస్తోంది. తెలంగాణకు కేంద్ర బృందం వచ్చింది. కేంద్రం ఏమీ చేయడం లేదని విరుచుకుపడుతున్న అధికార పార్టీకి కౌంటర్ ఇవ్వడానికి గ్రేటర్ ఎన్నికల్లో ఎలాగైనా తమ పట్టు నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్న కిషన్ రెడ్డి.. హుటాహుటిన కేంద్ర బృందాన్ని పిలిపించారు. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ప్రవీణ్ వశిష్ఠ నేతృత్వంలో అధికారుల బృందం తెలంగాణకు వచ్చింది. ముందుగా అధికారులతో సమావేశయ్యారు. వారి వద్ద నుంచి వరద నష్టం వివరాలు తెలుసుకున్నారు . ఆ తర్వాత రెండు బృందాలుగా విడిపోయి రాష్ట్రంలో వరద పరిస్థితిని పరిశీలించారు. ఓ బృందం సిటీలో పర్యటించగా..మరో బృందం ఇతర ప్రాంతాల్లో వర్షాల ధాటికి దెబ్బతిన్న పంటలను పరిశీలించింది. పర్యటన తరవాత రాష్ట్రంలో వరద పరిస్థితిపై కేంద్రానికి నివేదిక ఇస్తారు.
మరో వైపు కిషన్ రెడ్డి కూడా.. నీటి ముంపులోనే ఉన్న కాలనీలను పరిశీలించారు. వరదబాధితులకు రూ.10 వేల ఆర్థికసాయం సరిపోదని… ఇంకా పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్రం సాయం చేయడం లేదని టీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను కొట్టి పారేశారు. మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని.. కేంద్ర బృందం నివేదిక ఇచ్చిన తర్వాత కేంద్రం సాయం చేస్తుందని గుర్తు చేశారు. భారీ వరదలతో అతలాకుతలం అయిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమత్రులకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ఆ సమయంలో.. తెలంగాణ సీఎం కేసీఆర్.. హైదరాబాద్కు జరిగిన నష్టాన్ని ఏకరవు పెట్టారు. ఆ తర్వాత రెండు రోజులకే… దాదాపుగా ఐదు వేల కోట్ల నష్టం జరిగిందని.. దక్షణం రూ. 1350 కోట్లు సాయం చేయాలని లేఖ పంపారు.
అయితే.. అదే రోజు ఏపీ సీఎం జగన్ కు కూడా మోడీ ఫోన్ చేశారు. కానీ ఏపీలో అంతా సాధారణ పరిస్థితే ఉందని సీఎం చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన కేంద్రహోంమంత్రి సాయం కోసం లేఖ రాశారు. కానీ.. కేంద్ర బృందం మాత్రం ఏపీకి రాలేదు. ప్రభుత్వం ప్రత్యేకంగా పట్టుబట్టితే వచ్చే అవకాశం ఉంది. కేంద్ర బృందం పట్టుబడితేనే ఎక్కువ నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో ఏపీ సర్కార్ వెనుకబడింది.