ఉద్యోగులకు నిలిపివేసిన జీతాలు ఎలా చెల్లించాలా అని ఏపీ సర్కార్ కిందా మీదా పడుతోంది. రెండు నెలల్లో 12 శాతం వడ్డీతో చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. రెండు నెలలు దాటిపోయినా ప్రభుత్వం చెల్లించలేదు. అయితే ఇలా ఎంతో కాలం సైలెంట్ గా ఉండలేరు కాబట్టి.. ఉద్యోగ సంఘాలను పిలిపించిన ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు… వారికి ప్రభుత్వ వెర్షన్ వినిపించారు. ఎలాగూ ఉద్యోగ సంఘాల నేతలు… సామాజిక బాధ్యత ఉందని ప్రకటన చేస్తున్నారు కాబట్టి… మిగిలిన వారు నోరెత్తడం కష్టమే. సీఎంవో నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు.. వచ్చిన ఉద్యోగ సంఘాలతో సజ్జల చర్చలు జరిపారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్యోగ సంఘాల నేతలకు వివరించారు. మే, జూన్లో ఉద్యోగులకు ఇవ్వాల్సిన 15 రోజుల జీతాన్ని.. రాబోయే రెండు నెలల్లో ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే డీఏను కూడా పరిశీలిస్తామని చెప్పుకొచ్చారు. ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని సజ్జల బుజ్జగించి పంపేశారు. జీతాల బకాయిలు… డీఏపై .. త్వరలో ప్రభుత్వం వైపు నుంచి ప్రకటన చేస్తామని చెప్పి ఉద్యోగ సంఘాలను సీఎంవో అధికారులు పంపేశారు.
ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా ఉద్యోగులు నోరెత్తే పరిస్థితి లేదు. ఎవరూ కోర్టుకెళ్లే అవకాశం కూడా లేదు. ఎవరైనా అలా వెళ్తే.. వారి ఉద్యోగానికి గ్యారంటీ లేదు. అందుకే.. సజ్జల చెప్పింది విని వెళ్లడం తప్ప.. మరో దారి వారికి లేదు. ఎవరైనా రిటైర్డ్ ఉద్యోగులు కోర్టుకు వెళ్తే తప్ప.. మళ్లీ ఈ వ్యవహారంలో కదలిక ఉండకపోవచ్చంటున్నారు.