17 నిమిషాల కొన్ని సన్నివేశాల్ని ఏటీటీలో విడుదల చేయడం ఓరకంగా కొత్త విషయమే. ఇది సినిమా కాదు. సినిమాలో కొంత పార్ట్ మాత్రమే. దానికి ముందూ, వెనుక ఏముంటుందో తెలీదు. ఆయా సన్నివేశాల్ని అంత వరకూ మాత్రమే చూడగలం. దాన్ని ఏటీటీలో పెట్టడం, 50 రూపాయలు టికెట్ గా నిర్ణయించడం – మంచి మార్కెటింగ్ వ్యూహం. 50 రూపాయల టికెట్ కాబట్టి, బాలయ్య అభిమానులకు పెద్దగా భారం అనిపించదు. అందుకే `నర్తన శాల` బుకింగ్స్ ఊపందుకున్నాయని సమాచారం. ఇప్పటి వరకూ లక్ష టికెట్ల వరకూ తెగాయని, రేపు `నర్తనశాల` వచ్చే సమయానికి మరో లక్ష చేరే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అంటే…. దాదాపు కోటి రూపాయల ఆర్జన.
నిజానికి ఈ 17 నిమిషాల సన్నివేశాల్ని బాలకృష్ణ తన పుట్టిన రోజున విడుదల చేద్దామనుకున్నారు. కానీ.. `శివశంకరీ` పాట ఎఫెక్టో ఏమో, ఆ ప్రయత్నం నుంచి మానుకున్నారు. తరవాత శ్రియాస్ ఓటీటీ వాళ్లు ముందుకు రావడం, దాన్ని టికెట్ పెట్టి మరీ చూపించాలనుకోవడం జరిగిపోయాయి. 17 నిమిషాల ఈ సన్నివేశాల కోసం ఓ ట్రైలర్ కూడా కట్ చేసి వదిలారు. బాలకృష్ణ దర్శకత్వ ప్రతిభ చూడాలనుకునే వీరాభిమానులకు, సౌందర్య, శ్రీహరిలను చివరి సారి తెరపైచూడాలనుకున్నవారికి 50 రూపాయలు పెద్ద భారం కాదు. అందుకే ఈ స్థాయిలో టికెట్లు తెగాయి. `నర్తనశాల`లో పెద ఎన్టీఆర్ కూడా ఓ ఫ్రేములో కనిపిస్తారని, టాప్ హీరోలోని కొన్ని షాట్స్ ని ఇందుకోసం వాడుకున్నారని సమాచారం. ఈ రెండింటికీ లింకెలా కలిసిందో చూడాలి. `నర్తన శాల` వచ్చే ఆదాయాన్ని ఓ మంచి పని కోసం వాడతానని బాలయ్య ప్రకటించారు. అసలు `నర్తన శాల` వల్ల ఎంతొచ్చిందో? దాన్ని ఎందుకోసం ఉపయోగించబోతున్నారో, ఆ వివరాల్ని త్వరలో బాలకృష్ణే వివరిస్తారు.