సీఎం కేసీఆర్ ఇటీవలి కాలంలో తొలి సారి వెనక్కి తగ్గారు. తెలంగాణలో రైతులు పండిన మొక్కజొన్న పంటను ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. నిన్నటి వరకూ కేసీఆర్… మక్కలకు మద్దతు ఇచ్చి కొనుగోలు చేయడం అసాధ్యమని చెబుతూ వస్తున్నారు. ప్రభుత్వం వేయవద్దని చెప్పినా.. రైతులు పండించారని ప్రభుత్వం వాదిస్తూ వస్తోంది. అయితే.. కొద్ది రోజులుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైతుల ఆందోళనలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ప్రజాప్రతినిధుల ఇళ్లపై దాడులు చేసే పరిస్థితి వచ్చింది.
దీంతో కేసీఆర్ దిగిరాక తప్పలేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే మక్కలను కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు రైతులు నష్టపోవద్దనే మక్కలు కొనుగోలు చేయాలని నిర్ణయించామని.. యాసంగిలో ఎట్టి పరిస్థితుల్లో మక్కలు సాగు చేయవద్దుని రైతులకు కేసీఆర్ సూచించారు. ఇంత చెప్పినా మళ్లీ ఎవరైనా మక్కలు సాగు చేస్తే ప్రభుత్వ బాధ్యత లేదని హెచ్చరించారు. యాసంగిలో పండే మక్కలను ప్రభుత్వం కొనుగోలు చేయదని తేల్చి చెప్పారు.
కేంద్రం మొక్కజొన్నలపై 50 శాతం ఉన్న దిగమతి సుంకాన్ని 15 శాతానికి తగ్గించిందని.. మక్కల ధర పడిపోవడానికి కారణమైన పార్టీ నేతలే చిల్లర రాజకీయాలు చేస్తున్నారు కేసీఆర్ మండిపడ్డారు. వారి మాటలు రైతులు నమ్మొద్దని పిలుపునిచ్చారు. ఆర్టీసీ సమ్మె సహా అనేక అంశాల్లో కేసీఆర్.. తాను అనుకున్న నిర్ణయానికే మొదటి నుంచి కట్టుబడ్డారు. అయితే రైతుల విషయానికి వచ్చే సరికి… విషయం సీరియస్ కాక ముందే… మక్కల కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నారు.