కాంగ్రెస్ సీనియర్లలో ఐక్యత లేదు కానీ… దుబ్బాకలో మాత్రం ఎవరికి వారు కష్టపడి.. తమ ప్రతాపం చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అగ్రనేతలంతా తలా ఓ మండలం బాధ్యత తీసుకోవడంతో.. ఆయా మండలాల్లో మెజార్టీ తెప్పించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో వారంతా.. శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం పీసీసీ అధ్యక్ష రేస్ నడుస్తోంది. ఈ రేసులో నెగ్గాలంటే… కొత్తగా తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జ్ అయిన మాణిగం ఠాకూర్‌ని మెప్పించాలి. ఆయనను మెప్పించాలంటే.. పొగడ్తలతో కావడంలేదు. పనితీరుతోనే సాధ్యం. ఆ విషయం ఇప్పటికే సీనియర్లకు స్పష్టమయింది. అందుకే.. దుబ్బాకలో చెమటోడుస్తున్నారు.
గత ఉప ఎన్నికల్లో ఎవరూ పెద్దగా బాధ్యతలు తీసుకునేవారు కాదు. కానీ దుబ్బాకలో మాత్రం సీన్ మారిపోయింది. మాణిగం ఠాగూర్ స్వయంగా ఎన్నకిల ప్రచారంలో పాల్గొంటున్నారు. రేవంత్ రెడ్డికి మిర్దొడ్డి మండల బాధ్యతలు అప్పగించారు. ఆ మండలం టీఆర్ఎస్కు కంచుకోటల లాంటిది.. అయినప్పటికీ.. రేవంత్ నిరాశపడలేదు. తన టీమ్‌ను తెప్పించుకుని వ్యూహాలు పన్నుతున్నారు. శరవేగంగాప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ కన్నా ఒక్క ఓటు అయినా మెజార్టీ తేవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక అభ్యర్థిని తన చాయిస్‌గా ఎంపిక చేసి టిక్కెట్ ఇప్పించుకున్న మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తొగుట మండల బాధ్యత తీసుకున్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దొల్తాబాద్ మండలంలో ప్రచారం చేస్తున్నారు. అధికార పార్టీ కంటే 100 ఓట్లు ఎక్కువే తెస్తా అని శపధం చేశారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దుబ్బాక మండల బాధ్యతలు తీసుకున్నారు. నలుగురూ ఇప్పుడూ… పోటీ పడుతున్నారు. ఎవరికి వారు తమ మండలంలో మెజార్టీ తీసుకు వచ్చి… పీసీసీ రేసులో ముందుండాలని అనుకుంటున్నారు. ఎవరు మెజార్టీ సాధిస్తారో.. ఎవరికి అందలందక్కుతుందో.. ఎన్నికల ఫలితాల తర్వాతే తేలే అవకాశం ఉంది.